నీ భరతం పడతా చూడు!

Chandrababu Mark politics On Sri Bharat - Sakshi

బాలయ్య చిన్నల్లుడిపై బాబు మార్కు పాలి‘ట్రిక్స్‌’

తొలుత భరత్‌కు ఎంపీ టికెట్‌ నిరాకరించిన చంద్రబాబు

ఆనక బాలకృష్ణ ఒత్తిడితో ఎట్టకేలకు ఖరారు

ఆ వెంటనే రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ

జనసేనలోకి పంపి.. విశాఖ నుంచి భరత్‌పై పోటీకి దింపిన వైనం

విశాఖ ఎంపీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంవీవీవైపే కనిపిస్తున్న మొగ్గు

కనీస పోటీకి కూడా లేకుండా భరత్‌ను తొక్కేందుకే జేడీని ప్రవేశపెట్టారంటున్న టీడీపీ వర్గాలు

తద్వారా తన తనయుడితో ఎందులోనూ పోటీపడకుండా ముందు‘జాగ్రత్త’!

వీవీ లక్ష్మీనారాయణ అలియాస్‌ జేడీ లక్ష్మీనారాయణ.. ఇది ఏ తాను ముక్కో అందరికీ తెలుసు.. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎవరి ప్రభావంతో.. ఎవరి ప్రయోజనాలకోసం పనిచేశారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి... ప్రత్యక్ష పోటీకి దిగడం కూడా అదే ‘వర్గ’ ప్రయోజనం కోసమేనని తేటతెల్లమవుతోంది. అదే సమయంలో ఆయన ఉన్నట్టుండీ జనసేన తరఫున విశాఖ ఎంపీ బరిలోకి దిగడం వెనుక ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేమిటో తెలియాలంటే బాలకృష్ణ అల్లుళ్ల పోరు వద్దకు వెళ్లాల్సిందే.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నం లోక్‌సభ సీటును బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు శ్రీ భరత్‌ మొదట్నుంచీ ఆశిస్తూ వచ్చారు. ఆర్నెల్లక్రితం మూర్తి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దరిమిలా భరత్‌.. గీతం చైర్మన్‌ బాధ్యతలతోపాటు రాజకీయ వారసత్వం కూడా ఆశించారు. ఆ మేరకు సీఎం చంద్రబాబు నుంచి ఎంపీ టికెట్‌ హామీ కూడా తీసుకుని కొన్నాళ్లుగా ప్రచారం సైతం మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు తనయుడు లోకేష్‌ భీమిలి లేదా విశాఖ నార్త్‌ నుంచి పోటీ చేయాలని భావించడంతో.. తన కుమారుడికి ఇబ్బంది అవుతుందని భావించిన చంద్రబాబు.. భరత్‌ను పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. ఇందుకు భరత్‌ అంగీకరించలేదు. తన మామ బాలకృష్ణ వైపు నుంచి చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు.

ఈ క్రమంలో జరిగిన పరిణామాల్లో నారా లోకేష్‌ మంగళగిరికి తరలిపోగా.. భరత్‌కు విశాఖ ఎంపీ టికెట్‌ ఖరారు చేశారు. ఇవన్నీ పక్షం రోజులుగా అందరికీ తెలిసిన పరిణామాలే. విశాఖ నుంచి భరత్‌.. మంగళగిరి నుంచి లోకేష్‌.. మొత్తంగా బాలకృష్ణ అల్లుళ్ల టికెట్‌ కథ సుఖాంతమైనట్టేనని అందరూ భావించారు. కానీ సరిగ్గా అక్కడే చంద్రబాబు తన మాస్టర్‌ బ్రెయిన్‌కు పదునుపెట్టారు. తన మాట కాదని, తన కుమారుడిని జిల్లాలు దాటించి టికెట్‌ దక్కించుకున్న భరత్‌కు తన ’రాజకీయం’ ఎలా ఉంటుందో చవిచూపించాలనుకున్నారు. అంతే.. అప్పటివరకు భీమిలి నుంచి టీడీపీ తరఫున బరిలోకి దించాలని భావించిన జేడీ లక్ష్మీనారాయణను రాత్రికి రాత్రే జనసేనలోకి పంపారు. ఇటు టీడీపీ టికెట్‌ను భరత్‌కు ఖరారు చేసిన వెంటనే.. జనసేన నుంచి లక్ష్మీనారాయణ పేరును ఖరారు చేయించారు.

జనసేన తరఫున అన్నిచోట్లా డమ్మీ అభ్యర్థులే.. భరత్‌పై మాత్రం లక్ష్మీనారాయణ
వాస్తవానికి విశాఖ జిల్లాలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన.. టీడీపీ అభ్యర్థులపై నామమాత్రపు అభ్యర్థులను పోటీకి దించింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులపై ఏమాత్రం పోటీకి నిలవని అభ్యర్థులను దించుతోంది. అనకాపల్లి ఎంపీగా ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియని అభ్యర్థిని, అరకు లోక్‌సభ సీటుకు కూడా పోటీ చేయనని మొత్తుకుంటున్న అభ్యర్థిని బరిలోకి దిగాలని కోరుతోంది. కానీ విశాఖ లోక్‌సభకు వచ్చేసరికి ఏరికోరి లక్ష్మీనారాయణను బరిలోకి దించడం వెనుక చంద్రబాబు వ్యూహం దాగుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట్లో భరత్‌ కాకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావులను విశాఖ లోక్‌సభ అభ్యర్థులుగా టీడీపీ పరిశీలించిన సందర్భంలో మాత్రం పెద్దగా ఎవరికీ పరిచయం లేనివారి పేర్లను పరిశీలించిన జనసేన.. ఎప్పుడైతే టీడీపీ టికెట్‌ భరత్‌కు ఖరారైందో ఆ వెంటనే జేడీ లక్ష్మీనారాయణను అర్ధరాత్రి హడావుడిగా తీసుకొచ్చి ప్రకటించడం వెనుక చంద్రబాబు వ్యూహం దాగి ఉందని అంటున్నారు.

కనీస పోటీలోలేకుండాచేసేందుకే..
విశాఖ లోక్‌సభ చరిత్ర తీస్తే టీడీపీ ముప్‌పై ఆరేళ్ల ప్రస్థానంలో కేవలం మూడుసార్లు మాత్రమే గెలుపొందింది. అప్పుడూ వివిధ రాజకీయ పార్టీల పొత్తుల నేపథ్యంతోనే తక్కువ ఓట్లతో బయటపడింది. విశాఖ లోక్‌సభ సీటు టీడీపీకి ఎప్పుడూ అనుకూల సీటు కాదని స్వయంగా ఆ పార్టీ నేతలే అంగీకరిస్తారు. ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రమంతటా అనుకూల ప్రభావం ఉండడం, ఎంపీ సీట్లన్నింటినీ గెలుస్తుందని జాతీయ సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ దశలో విశాఖ సీటు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపనుందని తెలిసి కూడా భరత్‌ను కనీసంగా పోటీకి లేకుండా చేయాలనేది చంద్రబాబు తంత్రమని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మరోసారి సీటు అడకుండా, లోకేష్‌తో ఏ విషయంలోనూ పోటీ లేకుండా చేయాలన్న ముందస్తు వ్యూహంతోనే భరత్‌కు వచ్చే టీడీపీ ఓట్లను గండి కొట్టడానికే టీడీపీ మనిషిగా ముద్రపడ్డ జేడీని జనసేన తరఫున రంగంలోకి దించారన్న అభిప్రాయాలు స్వయంగా ‘దేశం’ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top