మీ ఆదరణే జగన్‌కు శ్రీరామరక్ష: విజయమ్మ

Chandrababu Copies YSRCP Manifesto, says ys vijayamma  - Sakshi

సాక్షి, శ్రీకాళహస్తి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టో పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట‍్టారన్నారు. అయిదేళ్ల తర్వాత ఆయనకు రైతు సంక్షేమం గుర్తుకు వచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకు పెద్దన్నయ్య అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇంతకాలం ఏం చేశాడన్నారు. డ్వాక్రా మహిళలకు నాలుగు దశల్లో మీ తమ్ముడు జగన్‌ మాఫీ చేస్తాడని హామీ ఇస్తున్నానని విజయమ్మ తెలిపారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాలనను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని, ఆయన పాలనను మళ్లీ వైఎస్‌ జగన్‌ అందిస్తాడని అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర, ఓదార్పు యాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసిన జగన్.. మీ సంక్షేమం చూసుకుంటాడని, ప్రజలు చూపుతున్న ఆదరణే జగన్‌కు శ్రీరామరక్ష అని అన్నారు. అంత పెద్ద ప్రమాదం నుంచి జగన్ బాబు బయట పడ్డాడని, ప్రజల ప్రార్థనలే తన బిడ్డను రక్షించాయని విజయమ్మ పేర్కొన్నారు. మన్నవరం ప్రాజెక్టు ఆరువేల కోట్లతో ఈ ప్రాంతంలో ఏర్పాటు కోసం వైఎస్సార్ కృషి చేశారని, దాన్ని కాపాడుకోలేని చేతకానీ ప్రభుత్వానిదనీ దుయ్యబట్టారు. చంద్రబాబు సొంత జిల్లాకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రభుత్వ సహకార రంగంలో ఉన్న చక్కెర, పాల డైరీలు మూయించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. 

ఏర్పేడు ఇసుక మాఫియా ఘటన దేశాన్నే కుదిపేసిందని, 17 మంది ప్రాణాలు కోల్పోయారని వైఎస్ విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నేతలు బరి తెగించి ఇసుక దందా చేస్తున్న చర్యలు లేవన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయం ద్వారా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తారని, ఏ ఫ్యాక్టరీ పెట్టినా స్థానికులకే మొదట ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో 25మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించడమే కాకుండా, గాజుల మాండ‍్యం షుగర్‌ ఫ్యాక్టరీ, విజయ డైరీ తెరిపించుకుందామని విజయమ్మ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి వైఎస్సార్ సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌ను గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top