ప్రకాశం పంతులుతో పోల్చుకున్న చంద్రబాబు

Chandrababu Compared him self As Tanguturi Prakasam Pantulu - Sakshi

సాక్షి, అమరావతి : గతంలో జాతిపిత మహాత్మా గాంధీతో పోల్చుకుని అభాసుపాలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి ఏకంగా తనను తాను టంగుటూరు ప్రకాశం పంతులుతో పోల్చుకున్నారు. వైకుంఠపురం బ్యారేజ్ శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు ఈ పోలిక తెచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు అయితే ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నేనే. ఆయన ప్రకాశం బ్యారేజీ కడితే నేను వైకుంఠపురం బ్యారేజ్‌కు శ్రీకారం చుట్టా. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్‌కి 13.2.1954లో శంకుస్థాపన చేస్తే, నేను వైకుంఠపురం బ్యారేజ్‌కి 13.2.2019లో శంకుస్థాపన చేశా. ప్రకాశం పంతులు శంకుస్థాపన చేసిన రోజే నేను కూడా శంకుస్థాపన చేశా. ఆయన ప్రకాశం బ్యారేజ్‌ని అత్యంత వేగంగా పూర్తి చేశారు. అలాగే నేను కూడా అంతకంటే వేగంగా ఈ బ్యారేజ్‌ని పూర్తి చేస్తా’  అని బాబుగారు చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌లో చంద్రబాబు తన హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందంటూ మళ్లీ పాత రికార్డే వేశారు. ‘గతంలో హైదరాబాద్‌ను నాలెడ్జ్‌ సిటీగా అభివృద్ధి చేశానని, 164 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌ రోడ్ నిర్మించామని, హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు సైబరాబాద్‌ను నిర్మించానని చెప్పారు. అమరావతి అంటే దేవతల రాజధాని. ఇక్కడ నివసించే వారు సుదీర్ఘ జీవితాన్ని పొందాలి. అన్ని వసతులతో పాటు నాణ్యమైన జీవనం వారికి అందించాలి. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో అత్యుత్తమ నగరాన్ని అమరావతిలో నిర్మిస్తున్నాం. రైతులకు కూడా వివరించాను. వ్యవసాయం కన్నా ఎక్కువ ఆదాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాను.  రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా 34వేల ఎకరాలను సంతోషంగా అమరావతికి ఇచ్చారు. 

సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. కృష్ణానదిపై మూడు బ్యారేజ్‌లు ఉంటాయి. చౌడవరం, వైకుంఠపురం, ప్రకాశం బ్యారేజ్‌లు. 120 కిలోమీటర్ల మేర స్వచ్ఛ జలాలను అందిస్తాయి. అమరావతి గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నాం. చాలా కన్సల్టెన్సీలు నగర నిర్మాణంలో సేవలు అందిస్తున్నాయి. అడ్మినిస్ట్రేటివ్‌ సిటీల వల్ల ఉపయోగం లేదు. దానికి భిన్నంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నాం. అత్యుత్తమ విద్యాసంస్థలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు తీసుకువస్తున్నాం. 2020 నాటికి ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌గా వుంటుంది’  అని చంద్రబాబు అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top