
సమావేశంలో మాట్లాడుతున్న తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుకొండ(పరకాల): ‘మూడు నియోజకవర్గాల్లో తమకు గెలిచే సత్తా ఉందని అంటున్న కొండా దంపతులకు దమ్ము, ధైర్యం ఉంటే పరకాల నియోజకవర్గం నుంచి నాతో పోటీకి రావాలి.. వారికి ప్రజలు చెమటలు పట్టించడం కాదు ఈ సారి మట్టి కరిపించడానికి సిద్ధంగా ఉన్నారు.. సంగెం మండల ప్రజలకు ఈ అవకాశం మరోమారు వచ్చింది’ అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుకొండ మండలం కొనాయమాకులలోని ఓంకార్ గార్డెన్స్‌లో బుధవారం సంగెం మండల టీఆర్‌ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధులు, ముఖ్యకా ర్యకర్తలు, బూత్ కమిటీల సభ్యులతో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
వినాయకచవితి నాటికి కొండా దంపతుల వంద తప్పులు పూర్తయ్యాయని, గుండాయిజం, రౌడీయిజం చేసేవాళ్లు, కాళ్లు మొక్కించుకునే నాయకులు ప్రజలకు అవసరం లేదన్నారు. గతంలో వంచనగిరి సమావేశంలో ఊరికో కొండా మురళి పుట్టాలని ఆయన కూతురు చెప్పారని, కానీ ఒక్కరితోనే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఊరికొకరు ఎందుకని ఎద్దేవా చేశారు. తను గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన సందర్భంగా డోలు కొట్టడం, డొమ్మరిగడ్డలు వేయడం తానే వేశానని, ప్రస్తుతం టీఆర్‌ఎస్ కార్యకర్తలు డోలు కొడితే తాను డొమ్మరిగడ్డలు వేస్తానన్నారు.
టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ బొమ్మల కట్టయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు గుగులోతు వీరమ్మ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కందకట్ల నరహరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గూడ సుదర్శన్‌రెడ్డి, ఏరియా కన్వీనర్ బుక్క మల్లయ్య, కోఆప్షన్ సభ్యులు మసూద్ అలీ, మాజీ ఎంపీపీ వీరాచారి, పసునూరి వజ్రయ్య, సింగిల్‌విండో చైర్మన్ కిషన్, జాగృతి నాయకుడు జున్న రాజు యాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లెబోయిన కిషోర్, సింగిల్ విండో చైర్మన్ కిషన్, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.