
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలివ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ పూట వారిని పస్తులు ఉంచుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దసరా, దీపావళి పండుగలకు కూలీ డబ్బులు ఇవ్వలేదని, సంక్రాంతికైనా వారికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన కొత్తబావుల తవ్వకం, పూడికతీత వంటి పనులకు కూలి డబ్బులను చెల్లించకపోవడంతో కూలీలు అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.