
న్యూఢిల్లీ: భారతీయ ముస్లింను 'పాకిస్థానీ' అంటూ ఎవరైనా అవమానిస్తే.. అతన్ని శిక్షించేలా చట్టాన్ని తీసుకురావాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన ఒవైసీ.. భారతీయ ముస్లింని 'పాకిస్థానీ' అని నిందిస్తే.. మూడేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. అయితే, కేంద్రంలోని మోదీ సర్కారు ఈ బిల్లు తీసుకువస్తుందని తాను భావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్ కాస్‌గంజ్‌లో మతఘర్షణల నేపథ్యంలో బరెలీ జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర విక్రమ్‌సింగ్ ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో బలవంతంగా ర్యాలీలు నిర్వహిస్తూ.. పాకిస్థానీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న విపరీత ధోరణీ ఇటీవల పెరిగిపోయిందని, దీనివల్ల మతఘర్షణలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్ర విమర్శలు బెదిరింపుల నేపథ్యంలో ఆయన తన ఫేస్‌బుక్ పోస్టును డిలీట్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాస్‌గంజ్‌లో జరిగిన అల్లరలో ఒకరు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒవైసీ ఈ డిమాండ్ చేశారు.