‘మూడో ఫ్రంట్‌’ పునరావృతం కాదు | Central Minister Ravi Shankar Prasad Comments On Third Front | Sakshi
Sakshi News home page

‘మూడో ఫ్రంట్‌’ పునరావృతం కాదు

Published Fri, Jun 1 2018 1:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:37 AM

Central Minister Ravi Shankar Prasad Comments On Third Front - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ వెనక బీజేపీ ఉందన్న ప్రచారాన్ని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తోసిపుచ్చారు. ఎలాంటి మూడో, నాలుగో కూటమికీ బీజేపీ అధికారికంగానూ, అనధికారికంగానూ ఏ విధంగా కూడా సలహాదారు కాదని స్పష్టం చేశారు. 1990ల్లో దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌ నేతృత్వంలో కేంద్రంలో థర్డ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు ఏర్పడిన ఘటనలు 2019లో పునరావృతం కాబోవని ధీమా వెలిబుచ్చారు. విపక్ష పార్టీలతో అతుకుల బొంతగా ఏర్పడే కూటములు ఎక్కువ రోజులు నిలవబోవన్నారు.  బీజేపీ వంటిæ బలమైన పార్టీ నేతృత్వంలోనే సుస్థిర ప్రభుత్వం సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2019లో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని నిలుపుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సాధించిన పురోగతి, విజయాలను గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రసాద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

భారీగా భూములు మింగే ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) ప్రాజెక్టులు ఆచరణలో సాధ్యం కావని, అందుకే దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా వాటిని పక్కన పెట్టామని చెప్పారు. ఈ విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ముందుకు వస్తే పరిశీలిస్తామన్నారు. ‘‘ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయిస్తేనే హైకోర్టు విభజన ప్రక్రియ సాధ్యమవుతుంది. ఏపీలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యేదాకా హైకోర్టు విభజన జరపరాదని ఆ రాష్ట్ర సీఎం హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’’అని చెప్పారు. ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటములకు బీజేపీ ఆందోళనపడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ కుంభకోణాలకు గత ప్రభుత్వమే కారణం’’అని ఆరోపించారు. తాజాగా బయటపడిన ఎయిర్‌ ఏషియా కుంభకోణమూ గత ప్రభుత్వ హయాంలో జరిగిందేనన్నారు. తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర కీలకం కానుందని జోస్యం చెప్పారు. 

‘‘జాతీయ వృద్ధి రేటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వంటి అభివృద్ధికి సూచికలు నాలుగేళ్లలో బాగా పెరిగాయి. పారదర్శకతతో అవినీతిని అడ్డుకున్నాం. భారీగా రహదారులను విస్తరిస్తున్నాం. ఉజ్వల యోజన పథకాల, అటల్‌ యోజన, ప్రధాని జీవన్‌ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు తెచ్చాం. డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, ముద్ర పథకాలతో యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. నాలుగేళ్లలో 7 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలొచ్చాయి’’అని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలయ్యేదాకా పెట్రోల్‌ ధరలు పెరగకుండా కేంద్రం నియంత్రించిందన్న విమర్శలు అవాస్తవమన్నారు.   

దేశ గతిని మార్చిన మోదీ 
అన్ని విషయాల్లో ప్రపంచం ప్రాధాన్యమిచ్చేలా దేశ గతిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చేశారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ అన్నారు. మోదీని విజ్ఞుడైన ప్రపంచ నేతగా, భారత్‌ను ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందుతున్న దేశంగా గుర్తిస్తున్నారని, ఇది భవిష్యత్తులో మన దేశం వేగంగా పురోగమించేందుకు సహకరిస్తుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే లబ్ధిదారుకు కేవలం 15 పైసలే చేరేవని.. ఇప్పుడు లబ్ధిదారు ఖాతాలో కేంద్రం రూ.వేయి జమ చేస్తే రూ.వేయి చేరుతోందన్నారు.  ప్రస్తుత కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో దేశానికి ఎంతో మేలు చేస్తాయన్నారు.  

ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తోంది భారతే.. 
ప్రపంచంలో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం భారతేనని రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. 2014లో మన దేశంలో కేవలం రెండు మొబైల్‌ ఫోన్‌ తయారీ పరిశ్రమలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 120కి పెరిగిందని వెల్లడించారు. అన్ని దేశాలు భారత్‌తో మైత్రిని కోరుకుంటున్నాయని, దాన్ని నిలబెట్టుకుంటూ వాటితో మన దేశం స్నేహంగా మెలుగుతోందన్నారు. భారత్‌ అనుసరిస్తున్న విధానాలతో పాకిస్తాన్‌ బెదిరిపోతోందని చెప్పారు.  

మోదీ నిజాయితీకిదే నిదర్శనం.. 
14 ఏళ్లు గుజరాత్‌ సీఎంగా, నాలుగేళ్లు దేశ ప్రధానిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మోదీ కుటుంబ సభ్యులు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అతి సాధారణ జీవితాలను గడుపుతున్నారని రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. ఇది ఆయన నిజాయితీకి నిదర్శమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రిటైర్డ్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement