కేంద్రం ఇచ్చింది.. 31,802 కోట్లే | The Center Offered 31 Crore Says Harish Rao | Sakshi
Sakshi News home page

కేంద్రం ఇచ్చింది.. 31,802 కోట్లే

Sep 23 2019 3:34 AM | Updated on Sep 23 2019 3:35 AM

The Center Offered .. 31 Crore Says Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల కింద ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన నిధులు కేవలం రూ.31,802 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు రాష్ట్రం నుంచి ఐటీ, జీఎస్టీ తదితర పద్దుల కింద మొత్తం రూ.2,72,926 కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్రం చెల్లించిన దాంట్లో కనీసం 15% కూడా వెనక్కు రాలేదన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులిస్తున్నట్లు బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం తప్ప అసలు గణాంకాలపై మాట్లాడబోరన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆదివారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడారు.  

ఆ రిజర్వేషన్ల మాటేంటి?: జీవన్‌రెడ్డి 
ఎస్సీ, మైనార్టీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్‌ కోటాపై రాష్ట్ర వైఖరి తెలపాలన్నారు. కొత్త పంచాయతీల ఏర్పాటైనప్పటికీ అక్కడ కొత్త రేషన్‌ షాపుల్లేక పాత పద్ధతే కొనసాగుతోందని, పంచాయతీకి రావాల్సిన రెవెన్యూ సైతం ఉమ్మడి పంచాయతీకి వెళ్తోందన్నారు. ఖైదీల క్షమాభిక్ష, టెట్‌ నిర్వహణ, రాష్ట్ర అప్పులపై స్పందించాలని కోరారు. 

రాష్ట్ర అప్పులు రూ.1.28 లక్షల కోట్లు.. 
అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు తప్పనిసరి అని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోందని, నిబంధనలకు లోబడే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని, అర్హత కంటే తక్కువ అప్పులున్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పు 1,28,153 కోట్లేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి రూ.75,577 కోట్లు అప్పుండగా.. ఆ తర్వాత రూ.1,57,351 కోట్లకు చేరిందన్నారు. ఇటీవల 29,198 కోట్లు రీపేమెంట్లు చేసినట్లు చెప్పారు. ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు వివరించారు.

కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు రేషన్‌షాపులతో పాటు పంచాయతీ భవనాలను నిర్మిస్తామని, క్రమపద్ధతిలో ఈ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఖైదీల క్షమాభిక్ష, ఉద్యోగులకు ఐఆర్, పదవీ విరమణ పెంపు అంశం సీఎం పరిశీలనలో ఉన్నాయన్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం తప్పకుండా చెల్లిస్తుందని చెప్పారు. కొత్తగా తెస్తున్న రెవెన్యూ చట్టంపై త్వరలో శాసనసభ, మండలిలో ప్రత్యేక చర్చ నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు.

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల మేర రాయితీలు ప్రకటించిందని, దీంతో కేంద్రానికి రావాల్సిన ఆదాయం ఆమేరకు తగ్గుతుందని, ఫలితంగా సంక్షేమ పథకాల్లో కోత లు పడతాయన్నారు. ఈ ప్రభావం రాష్ట్రాల బడ్జెట్‌ పై పడుతుందని వెల్లడించారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది.  

1.17 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలామంది రైతులకు రైతు బంధు అందడం లేదని, ఉద్యోగాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సభలో డిమాండ్‌ చేశారు. దీనిపై హరీశ్‌ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన మొత్తాల వివరాలను సభ ముందుంచారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ సంక్షేమ కార్యక్రమానికి నిధులు తగ్గించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1.49 లక్షల ఉద్యోగాలకు ఆమోదం తెలిపితే నియామక బోర్డులు, శాఖల ద్వారా ఇప్పటివరకు 1.17 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు  తెలిపారు. మిగతా వాటిపై కోర్టు కేసులుండటంతో ప్రక్రియ కొంత ఆలస్యమైందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement