కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

Buggana Rajendranath Reddy Slams On Gorantla Buchaiah Choday - Sakshi

బుచ్చయ్య వాదనను తిప్పికొట్టిన బుగ్గన 

టీడీపీ దోపిడీకి వంతపాడలేమని స్పష్టీకరణ 

చంద్రబాబులా నిరుద్యోగులను మోసం చేయం 

మా చిత్తశుద్ధి ఏపాటిదో నిరూపించుకున్నాం 

సాక్షి, అమరావతి:  గోరంట్ల బుచ్చయ్యా.. ఇక మీ అసత్యాలు ఆపండయ్యా.. అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. కాకి లెక్కలు, చేపల లెక్కలతో వ్యవసాయ వృద్ధి రేటు పెరిగిందన్న టీడీపీ వాదనలో పస లేదని తేల్చి చెప్పారు. అంకెల గారడీతో ఎంత కాలం మోసం చేస్తారని నిలదీశారు. 2019–20 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సోమవారం అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను బుగ్గన ఖండించారు. అంతకుముందు గోరంట్ల మాట్లాడుతూ బడ్జెట్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేలా లేదన్నారు. వాస్తవ పరిస్థితుల్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నానన్నారు. 2014లో రూ.1,12,000 కోట్లుగా ఉన్న బడ్జెట్‌ ఇప్పుడు రూ.2,26,000 కోట్లకు చేరిందని, గత ఐదేళ్లలో అభివృద్ధి లేకపోతే ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. 2013–14లో 5.3 శాతంగా ఉన్న అభివృద్ధి 2019 నాటికి 11.5 శాతానికి చేర్చిన ఘనత తమదేనని వివరించారు. ఆర్థిక సర్వేలో అభివృద్ధి సాధించామని చెబుతూ బడ్జెట్‌లోనేమో లేదనడం ఎలా సాధ్యమన్నారు.

ప్రస్తుత బడ్జెట్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికగా ఉందని, తాము ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలను మూత వేయిస్తున్నారని ఆరోపించారు. దీనికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ అభ్యంతరం తెలిపారు. ప్లానింగ్‌ విభాగం తయారు చేసిన ఆర్థిక సర్వేకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాకి లెక్కలు చెప్పవద్దన్నారు. వ్యవసాయాభివృద్ధిని కొలవడానికి నిర్ధిష్టమైన పద్ధతులు లేవనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. పథకాల పేర్ల మార్పును గోరంట్ల తప్పుబడుతున్నారని, వాస్తవానికి ఆరోగ్య శ్రీ,, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, సామాజిక పింఛన్ల పెంపు వంటివి డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రవేశపెట్టినవేనని, అందుకే వాటికి ఆయన పేరు పెట్టామని చెప్పినప్పుడు సభ చప్పట్లతో మార్మోగింది.

రాష్ట్రంలో తాము ఏ ఫ్యాక్టరీని ఆపలేదని, కర్నూలులో ఏ సీడ్‌ ఫ్యాక్టరీని ఆపామో చెప్పాలని నిలదీశారు. ఈ ఏడాదికి సున్నా వడ్డీ డబ్బులను వచ్చే బడ్జెట్‌లో కేటాయిస్తారన్న విషయం తెలియకపోతే ఎలా? అని నిలదీశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడతారని వివరిస్తూ వచ్చే ఉగాదికి కచ్చితంగా 23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 5 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. చంద్రబాబు మాదిరిగా నిరుద్యోగులను మోసం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రస్తుతం ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంటే టీడీపీ సభ్యులు దుర్బుద్ధితో అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ దశలో టీడీపీ, అధికార పార్టీ సభ్యులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.  

మీరు చేసిన అప్పును మేము తీర్చాం 
చంద్రన్న కానుక అని టీడీపీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుందిగానీ పౌర సరఫరా శాఖకు రూ.100 కోట్లు బకాయి పెట్టిందని మంత్రి బుగ్గన తెలిపారు. ఆ అప్పును తాము తీర్చామన్నారు. విత్తనాల కొనుగోలుకు గత ప్రభుత్వం డబ్బులు చెల్లించనే లేదని,  తమ ప్రభుత్వం వచ్చాక రూ.400 కోట్లు చెల్లించి విత్తనాలు సమీకరించామన్నారు. 2014 నుంచి 2017వరకు పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. 2017–18లో మాత్రం రూ.69.94 కోట్లు కేటాయించి,  2018–19లో మొండి చేయి చూపిందని చెప్పారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే రూ.1,500 కోట్లు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు.

టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అమరావతి నిర్మాణానికి రూ.1,777 కోట్లు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఇచ్చిందని, అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.277 కోట్లు మాత్రమే ఇచ్చిందని వివరించారు. తమ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే రూ.500 కోట్లు కేటాయించిందని తెలిపారు. పింఛన్ల కోసం టీడీపీ ఐదేళ్లలో సగటున రూ.5 వేల కోట్లు వెచ్చిస్తే తమ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే రూ.15,746.58 కోట్లు కేటాయించిందని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో దీన్ని మరింత పెంచుకుంటూ పోతామన్నారు. రాజధానిలో కి.మీ. రోడ్డుకు రూ.32 కోట్ల చొప్పున తమ సన్నిహితులకు కాంట్రాక్టులు ఇచ్చి చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని, ఈ తరహా దోపిడీని అడ్డుకునేందుకే రివర్స్‌టెండరింగ్‌ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. నీరు–చెట్టు పథకం పేరిట కూడా దోచుకున్నారని మండిపడ్డారు.    

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top