చంద్రబాబు లేఖలో అన్నీ అసత్యాలే | Botsa Satyanarayana Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు లేఖలో అన్నీ అసత్యాలే

Jul 20 2020 3:37 AM | Updated on Jul 20 2020 9:43 AM

Botsa Satyanarayana Fires On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాజధానిపై గవర్నర్‌కు చంద్రబాబు రాసిన లేఖలో అన్నీ సత్యదూరాలే తప్ప వాస్తవాలు లేవని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను కప్పిపుచ్చుకునేందుకే ఆ లేఖ రాశారని ఆరోపించారు. శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు పూర్తిగా విస్మరించి నిపుణుల కమిటీ అని చెప్పి తనకు అనుకూలంగా నివేదిక ఉండేలా నారాయణ కమిటీ వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోదించొద్దంటూ గవర్నర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు సిఫారసు మేరకే నారాయణ కమిటీ అమరావతిని రాజధానిని చేసిందని.. కానీ, నిపుణుల కమిటీ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక చూస్తే మూడు రాజధానుల అంశం కనిపిస్తుందని చెప్పారు. చంద్రబాబుకు దూరదృష్టి లేదని శివరామకృష్ణన్‌ తను రాసిన పుస్తకంలో పేర్కొన్నారని గుర్తుచేశారు. బొత్స ఇంకా ఏమన్నారంటే.. 

అమరావతి పేరిట వేల కోట్లు వృథా 
► అమరావతి నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చుచేశామన్న చంద్రబాబువి అన్నీ అవాస్తవాలే. రాజధాని కోసం నాడు టీడీపీ వాస్తవంగా రూ.7,635 కోట్లే ఖర్చుచేసింది. 
► అందులో హంగు, ఆర్భాటాలకు పోనూ నిర్మాణాలకు ఖర్చుచేసింది రూ.5,674 కోట్లే. 
► అందులో రూ.4941 కోట్లను హడ్కో రుణం, బాండ్ల రూపంలో సేకరించారు. వాటికి వడ్డీల కింద, ఈఎంఐల కింద రూ.329 కోట్లు చెల్లించారు. 
► ల్యాండ్‌ ఫూలింగ్‌ పేరిట రూ.1,300 కోట్లు ఖర్చుచేశారు. ఇలా.. అమరావతి పేరిట వేల కోట్లు దుర్వినియోగం, వృధా చేశారు.  
► అంతేకాక.. విజయవాడ–గుంటూరు మధ్య రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో మిగలిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది.
► ఏటా 3 పంటలు పండే సారవంతమైన భూముల్లో రాజధాని ఏర్పాటు సరికాదని కూడా ఆ కమిటీ పేర్కొంది. ఇది వాస్తవమా.. కాదా..?

ఆ లక్ష్యంతోనే ముందుకు..
► ప్రజల ఆకాంక్ష మేరకే సీఎం వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. 
► మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. శాసనసభలో రెండుసార్లు బిల్లులను ఆమోదించాకే గవర్నర్‌ ఆమోదానికి పంపించాం. 
► మండలిలో బిల్లుపై ఓటింగ్‌ పెట్టాలని టీడీపీ మినహా అన్ని పార్టీలు గతంలో కోరినా.. చంద్రబాబు సూచనల ప్రకారం విచక్షణాధికారం అని శాసన మండలి చైర్మన్‌ సంతకం చేయకుండా తప్పించుకుని అనైతికంగా వ్యవహరించారు.
► విచక్షణాధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలి కానీ, చంద్రబాబు ప్రయోజనాల కోసం కాదు.
► నిబంధనలకు అనుగుణంగానే రాజధాని బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి పంపాం.

విశాఖకు లక్షల కోట్లు అవసరంలేదు 
విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుచేయడానికి లక్షల కోట్లు అవసరం లేదని బొత్స చెప్పారు. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని.. ఇప్పటివరకు అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు ఖర్చుచేసిన మొత్తంతో విశాఖలో రాజధానిని ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలంటే చంద్రబాబుకు అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే.. రాజధానిపై ఏకపక్ష నిర్ణయం తగదని చంద్రబాబుకు ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టీడీపీనే గెలిపిస్తూ వచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలకే వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement