విద్యాశాఖ మంత్రిని ఎందుకు తప్పించడం లేదు?

BJP Leaders Meets Governor Narasimhan Over Telangana Inter Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని, సీఎం కేసీఆర్‌ ఎందుకు తప్పించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేసే వరకు తాము ఉద్యమం చేస్తామని అన్నారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కలిసిన బీజేపీ నేతలు తెలంగాణ ఇంటర్‌ బోర్డు వైఫల్యాలపై ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో లక్ష్మణ్‌, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రామచంద్రారావు ఉన్నారు. ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్‌ నిర్వహించాలని కోరారు. గ్లోబరీనా సంస్థ బాగోతాలపై దర్యాప్తు జరిపించి.. ఆ సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలన్నారు. ఆందోళన చేసిన విద్యార్థుల తల్లిదండ్రులపై, విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలన్నారు. మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని అన్నారు.

ఈ సమావేశం అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరీనా సంస్థకు అనుభవం లేకపోయిన ఆ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు జరగడంతో లక్షలాది మంది తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారని.. 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ అంశంలో ప్రభుత్వం న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరారు. వారం తరువాతైనా సీఎం ఈ ఘటనపై స్పందించినందుకు సంతోషం అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని నిలదీశారు. గవర్నర్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించినట్టు పేర్కొన్నారు. అశోక్‌ కుమార్‌ను బోర్డు కార్యదర్శి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. 

దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై తామిచ్చిన ఫిర్యాదుపై గవర్నర్‌ స్పందన సంతృప్తికరంగా ఉందన్నారు. విద్యార్థులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకూడదని కోరారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో  విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగిందని విమర్శించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు చేసుకోవడం బాధకరమన్నారు. సీఎం పాలన ఫామ్‌హౌస్‌కే పరిమితమయిందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా మంత్రిపై, బోర్డు కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కేసీఆర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 9 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్‌కు ఒక్క క్షణం కూడా సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. అవినీతితో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top