ఎమర్జెన్సీని తలపించేలా కేసీఆర్‌ పాలన

BJP Leader Kishan Reddy Slams TRS Government  - Sakshi

గవర్నర్‌ ప్రసంగంపై చర్చలో బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వతీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదని శాసనసభలో బీజేపీ పక్షనేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. బుధవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపే పరిస్థితులు లేవు. కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల్లో ప్రభుత్వంపై తీవ్ర నిరాశ, బాధ ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలో కాళ్లకు ఇనుప సంకెళ్లు వేశారు. ఇప్పుడు రైతుల చేతులకు బంగారు సంకెళ్లు వేస్తున్నారు. వర్గీకరణపై పోరాడిన మంద కృష్ణను రెండుసార్లు జైలుకు పంపారు. మీడియా గొంతు నొక్కేస్తున్నారు. కలాలకు, కళాకారులకు సంకెళ్లు వేస్తున్నారు. ఇలా చేసి బంగారు తెలంగాణ సాధిస్తారా?’అని ప్రశ్నించారు. నేతల భాషపైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. రైతులకు పావలా వడ్డీకి రుణాలివ్వాల్సిన అవసరం ఉందని, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు అరకొర నిధులతో పనులు జరగక ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు.  

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: ఆర్‌.కృష్ణయ్య
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్ల కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం అభినందనీయం, మద్దతు కూడా తెలుపుతున్నామని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను ఒక జీవో ద్వారా రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉందని, దీనిపై అధికారులతో చర్చించి వీలై నంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top