టెంట్లే లేవు.. కానీ ఫ్రంట్‌లా!: కిషన్ రెడ్డి

BJP Leader Kishan Reddy Fire On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న ఫ్రంట్‌ గురించి మాట్లాడుతూ.. టెంట్లే లేవు.. కానీ ఫ్రంట్‌ల గురించి మాట్లాడుతున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం శాసనసభ సమావేశాలు పెడితే సీఎం కేసీఆర్ మాత్రం ఫ్రంట్‌ల గురించి మాట్లాడటం తగదన్నారు. బడ్జెట్ సమావేశాలు చాలా నిరుత్సాహంగా, ఓ తంతులాగా జరిగాయన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా తర్వాత మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సభ నిర్వహణలో పాలకపార్టీ టీఆర్ఎస్ తీరు విచిత్రంగా ఉందని, తాము లేవనెత్తిన అంశాలపై మాట్లాడనివ్వకుండానే పద్దులపై చర్చ తూతూ మంత్రంగా ముగించారని చెప్పారు. ద్రవ్యవ వినిమయ బిల్లుపై వివరణ ఇవ్వకుండానే పాస్ చేయించుకోవడం టీఆర్‌ఎస్‌కే సాధ్యమన్నారు. 

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మిగులు రాష్ట్రమే కానీ ఇప్పుడు అప్పుల రాష్ట్రం. గొప్పలకు పోయి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. ఈ బడ్జెట్ సమావేశాలను టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికే పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రంలో తాము కూడా అప్పుడే వచ్చామన్నారు. తాను అడిగిన అంశంపై ప్రభుత్వం అజ్ఞానమా, అధికారమా టీఆర్ఎస్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఎఫ్ఆర్‌బీఎంలో 3.8 కంటే ఎక్కువ పెరగకూడదని ఉంది కానీ ఇష్టా రాజ్యంగా నిధులు పెంచి ఖర్చు పెట్టారని చెప్పారు. 2016-17లో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ రికార్డ్ స్థాయిలో 5.46కి పెరిగిందన్నారు. ఆడిట్ రిపోర్టులో వచ్చిన నిజాలపై, తాను చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దొంగ యూసీలు ఇచ్చిందని కాగ్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. 

'ఏదైనా అడిగితే సమాధానం చెప్పకుండా కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి మాట్లాడుతూ మా గొంతు నొక్కారు. ఒకరోజు ముందు బిల్లు ప్రతులు బీఏసీలో ప్రవేశపెట్టాలి. తెలుగు తప్పనిసరి బిల్లును కేవలం రెండు నిమిషాల ముందు ఇచ్చి చర్చ ప్రారంభించారు. సబను 13 రోజులకే పరిమితం చేసి పంచాయతీ రాజ్ బిల్లు రాత్రికి రాత్రే ఇచ్చారని' బీజేపీ నేత కిషన్ రెడ్డి వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top