కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వాదన దివాలాకోరు విధానానికి నిదర్శనం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి పరిరక్షణే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందని..అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్‌ఎస్ బయటపెట్టిన సింగరేణి టెండర్ల కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి స్పందించిన తీరు పట్ల బుధవారం ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భారీ స్కామ్‌పై విచారణ జరపాలని క్షేత్రస్థాయిలో సింగరేణి కా ర్మికులు మోగించిన జంగ్ సైరన్ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక లాంటిదని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ వెల్లడించిన సింగరేణి టెండర్ల అక్రమాలపై స్పందిస్తూ, ఈ స్కామ్‌లో ప్రధాన దోషిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి సీబీఐ విచారణ కోరితేనే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్న కేంద్ర మంత్రి వాదన దివాలాకోరు విధానానికి నిదర్శనం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అక్రమ పద్ధతిలో తన బావమరిదికి టెండర్లు కట్టబెట్టిన సీఎం తానే సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేయాలని ఆశించడం మూర్ఖత్వానికి పరాకాష్ట కాదా అని నిలదీశారు.
పట్టపగలు దోపిడీ చేసిన దొంగ ఎక్కడైనా స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపైనే విచారణ జరపాలని కోరతాడా అని ప్రశి్నస్తూ, సింగరేణి స్కామ్‌లో ఇదే తరహా విచిత్రమైన వాదనను కేంద్ర మంత్రి చేయడం ఆశ్చర్యకరమని మండిపడ్డారు. ఇది కేవలం కేంద్రమంత్రి అజ్ఞానమా లేక సీఎం రేవంత్‌రెడ్డితో బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందాల ఫలితమా అని కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు.


