
అబద్ధాల పునాదుల మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆరోపించారు.
సాక్షి, న్యూఢిల్లీ: అబద్ధాల పునాదుల మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను అమిత్‌షాతో వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ను కలిపానన్న ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్దమన్నారు. ఈ క్రమంలో మంత్రులు అచ్చెనాయుడు, అమర్నాథ్ రెడ్డి, లోకేశ్, చంద్రబాబు నాయుడులకు ఆయన సవాల్ విసిరారు. టీడీపీ నాయకులు తనపై మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ఏపీ భవన్ ప్రభుత్వ గెస్ట్‌హౌస్ ఎవరైనా రావచ్చు.. దానికి రాజకీయాలను అపాదించడం సరికాదన్నారు.
ఇప్పుడు కుట్ర రాజకీయలు ఎవరు చేస్తున్నారో ప్రజలకు అర్థం అవుతుందని తెలిపారు. తనని బుగ్గన రాజేంద్రనాథ్ కలిసిన మాట వాస్తవమని, ఇద్దరం కలిసి శాంగ్రీల హోటల్‌లో కలసి భోజనం చేసిన మాట నిజమేనన్నారు. అయితే ఇందులో రహస్య సమావేశం ఎక్కడ ఉందో లోకేష్ వివరణ ఇవ్వాలన్నారు. టీడీపీ కుటిల రాజకీయాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తోంది. మల్టీ నేషనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ని రాష్ట్ర ప్రయోజనాల కోసం అడిగామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన ఇస్తారని.. ఏపీ ప్రజలు ఎన్నుకున్నారు.. కానీ దానికి విరుద్ధంగా టీడీపీ పనిచేస్తుందని విమర్శించారు. స్పీకర్ వ్యవస్థను టీడీపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ స్థాయిలో తాను ఎవరిని కలవలేదని ఆయన స్పష్టం చేశారు.