బీజేపీకి రూ.80 వేల కోట్లు.. హజారే సంచలనం

BJP Coffers Received Rs. 80,000 Crore : Anna Hazare - Sakshi

సాక్షి, గువాహటి : ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే ఎన్డీయే, బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఐదు నెలల్లోనే బీజేపీ ఖాతాలో రూ.80వేల కోట్లు వచ్చి పడ్డాయని అన్నారు. చందాల పేరిట అక్రమంగా డబ్బును పోగేసిందని మండిపడ్డారు. ఆసియాలోనే భారత్‌ గత మూడేళ్లలో అవినీతిలో నెంబర్‌ 1 స్థానంలో ఉందని, ఇవి తాను అన్న మాటలు కావని ఫోర్బ్స్‌ మేగజిన్‌ను ఉటంకించారు.

'గడిచిన మూడేళ్లల్లో భారత్‌ ఆసియా ఖండంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇది నేను మాత్రమే అన్న మాటలు కావు.. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సర్వేను నిర్వహించిన ఫోర్బ్స్‌ మేగజిన్‌ స్పష్టంగా పేర్కొంది. నేను మూడేళ్లుగా మౌనంగా ఉన్నాను. ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి కొంత సమయం ఇవ్వాలి. అందుకే మౌనంగా ఉన్నాను. కానీ, ఇప్పుడు వారు చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే టైం వచ్చింది. రైతుల కోసం శక్తిమంతమైన జన్‌ లోక్‌పాల్‌ తీసుకొచ్చేందుకు నేను మరో మహోధ్యమం మొదలు పెట్టబోతున్నాను. వచ్చే ఏడాది మార్చి 23 నుంచి ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాను. సామాన్య జనం ఇంకా పలు సమస్యలతో సతమతమవుతున్నారు. రైతులు బాధపడుతున్నారు. బ్యాంకులు రైతులకు రుణాలు ఇస్తున్నాయి కానీ ఇష్టమొచ్చినట్లు వడ్డీలు వసూలు చేస్తున్నాయి.

ఆర్బీఐ సమాన తక్కువ వడ్డీ రేట్లను ఫిక్స్‌ చేయాలి. రైతులు వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. గత మూడేళ్లలో నేను ప్రధాని మోదీకి 32 లేఖలు రాశాను.. అన్నీ వెళ్లాయి కానీ పీఎంవో నుంచి ఎలాంటి బదులు లేదు. ప్రత్యేకంగా రైతుల సమస్య తీర్చడం కోసమైన ఒక బలమైన లోక్‌పాల్‌ బిల్లును తెచ్చేందుకు ప్రతి ఒక్కరినీ కలుపుకొని ఉద్యమిస్తా. ప్రజలతో మాట్లాడేందుకు ఎక్కడికైనా వెళతా.. జైలుకు వెళ్లేందుకైనా మేం సిద్ధం. వారు మనల్ని జైలులో పెడితే ఈ దేశంలో ఉన్నవారంతా కూడా జైలు కొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయం చెబుతాం. ఒకప్పుడు ప్రభుత్వ అధికారులు తప్పకుండా వారి ఆస్తుల చిట్టాను ప్రకటించేవారు. ఈ ప్రభుత్వం వచ్చి అది లేకుండా చేసింది. అదే సమయంలో 7.5 శాతం తమ ఆదాయాన్ని పార్టీలకు ఫండ్‌గా ఇచ్చేందుకు మాత్రం అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఎంత డబ్బయినా పార్టీకి ఫండ్‌గా ఇవ్వొచ్చు' అని హజారే మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top