కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

BJP AP Spokeperson Sensational Comments on Kodela Siva Prasada Rao - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పీ రఘురాం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు బీజేపీలో చేరాలనుకున్నారని.. దీనికి సంబంధించి ఆయన అమిత్‌ షాను కూడా కలవాలనుకున్నారని రఘురామ్‌ వెల్లడించారు. చంద్రబాబు తన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. నిజాయితీ గల వారికి పార్టీలో విలువ లేదని తనతో నెల రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడినప్పుడు కోడెల చెప్పారని రఘురాం తెలిపారు. ఈ విషయమై ‘సాక్షి’ టీవీతో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

నెలరోజుల క్రితం నాకు ఫోన్‌ చేశారు
‘నెల రోజుల క్రితం కోడెల శివప్రసాదరావు నాకు ఫోన్‌ చేసి సుదీర్ఘంగా మాట్లాడారు.  అమిత్‌ షాని కలువాలని నాతో చెప్పారు. దీంతో హైకమాండ్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను. సమయం చూసుకొని ఢిల్లీకి వచ్చి బీజేపీ పెద్దలతో కలుస్తాననని ఆయన చెప్పారు. అందుకు నేను సరే సర్‌ అని చెప్పాను. కోడెల సుదీర్ఘంగా రాజకీయ అనుభవం గల వ్యక్తి. పల్నాటి రాజకీయాల్లో పెద్దమనిషి, పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తి. డాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు సేవలందించారు. 
ఆయనను కోల్పోవడం ప్రజలకు బాధ కలిగించింది.

మృతిని రాజకీయం చేయరాదు
కోడెల మృతిని రాజకీయం చేయరాదు. పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తి ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వారం రోజుల కిందట బీజేపీలో నా కంటే సీనియర్‌ నాయకుడితో ఆయన టచ్‌లో ఉన్నారు. టీడీపీ అధినాయకత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును కోడెల జీర్ణించుకోలేకపోయారు. సన్‌ స్ట్రోక్‌ కూడా ఇబ్బంది పెట్టింది. రూపాయి ఆశించకుండా వైద్యం చేసిన వ్యక్తి.. తన పిల్లల మీద, తన మీద ఆరోపణలు రావడంతో బాధపడ్డారు. ఈ కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు అండగా నిలబడలేదు. కష్టసమయంలో పార్టీ తనను ప్రొటెక్ట్‌ చేయలేదన్న ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది. ఆయన పార్థీవదేహం ఉండగానే ఆయన మృతి పట్ల రాజకీయాలు చేయడం మంచి విషయం కాదు.

చంద్రబాబు పట్టించుకోలేదు
రాజకీయాల్లో కేసులు కొత్తకాదు. చిదంబరం, లాలూ, జయలలిత లాంటి వ్యక్తులు కేసులు ఎదుర్కొన్నారు. కేసులు పెట్టినంతమాత్రాన కోడెల భయపడతారని నేను అనుకోవడం లేదు. కష్ట సమయంలో పార్టీ నన్ను ఒంటరివాడిని చేసింది.. మద్దతు ఇవ్వలేదన్న ఆవేదన కోడెల మాటల్లో కనిపించింది. అందుకే బీజేపీలో చేరాలని అనుకున్నారేమో.. ఆరోపణలు వచ్చిన కష్టసమయంలో అండగా నిలబడకుండా చంద్రబాబు, అధినాయకత్వం తనను  నిర్లక్ష్యం చేసిందని, పట్టించుకోలేదని ఆయన భావించారు. పార్టీ నేతలు కూడా తనపై విమర్శలు చేయడం ఆయనను బాధించింది. కోడెల విషయమై నేను చేసిన ట్వీట్‌ చూసి ఓ సీనియర్‌ జర్నలిస్టు కూడా నాతో మాట్లాడారు. మీరు చెప్పిన విషయం వాస్తవమేనని, పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని కోడెల తనతో బాధపడినట్టు ఆ జర్నలిస్టు చెప్పారు.  పార్టీ అధినాయకత్వం తీరుతో ఆయన అభద్రతాభావానికి లోనయ్యారు. నిజాయితీపరులకు టీడీపీలో స్థానం లేదని కోడెల చెప్పారు. పార్టీ తనను ఏ విధంగానూ ప్రొటెక్ట్‌ చేయలేదని కోడెల అన్నారు. 

ఆయన మృతిపై దర్యాప్తు జరపాలి
కోడెల పార్థీవదేహం ఉండగానే రాజకీయంగా రచ్చ చేయడం సరికాదు. ఇరురాష్ట్ర ప్రభుత్వాలు కోడెల మృతిపై సమగ్రమైన విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. కోడెల పర్సనల్‌ సెల్‌ఫోన్‌ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్టీ తీరుతో ఒంటరి భావనకు లోనైన కోడెల ఒక నెల కిందట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని, ఆస్పత్రిలో కూడా జాయిన్‌ అయ్యారని గతంలో కథనాలు వచ్చాయి.  కోడెల మృతి విషయంలో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరముంది. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top