కమలంలో కలహాలు.. కామ్రేడ్‌ల కుమ్ములాటలు

BJP And CPI Leaders In Economic And Leadership Disputes - Sakshi

సార్వత్రిక ఎన్నికల అనంతరం అంతర్గత విభేదాలు

ఆర్థిక, నాయకత్వ వివాదాల్లో బీజేపీ, సీపీఐ నేతలు

ఢిల్లీ వరకూ వెళ్లిన ఫిర్యాదులు

ఇతర పార్టీలవైపు చూస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు

ఇళ్లకే పరిమితమైన తెలుగు తమ్ముళ్లు

ఎన్నికల అనంతరం పార్టీల్లో ఫలితాలపై మేథోమధనం సర్వసాధారణమే. జరిగిన తప్పిదాలపై చర్చించుకోవడం.. భవిష్యత్తు కార్యక్రమాలకు సమాయత్తం కావడం దీని ముఖ్యోద్దేశం. కానీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీలో ఇప్పుడు కలహాలు మొదలయ్యాయి. జిల్లాకు కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి కాస్తా ఢిల్లీవరకూ చేరాయి. సీపీఐలో ఆధిపత్య పోరు మొదలైంది. ఇక తెలుగుదేశం పార్టీ ఉనికినే కోల్పోయేలా నాయకులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన పార్టీల్లో కొన్ని కనుమరుగైపోగా కొన్ని పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల్లో జిల్లాలోని ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానాన్నీ గెలుచుకోలేకపోయిన టీడీపీ నేతలు ఇంటికే పరిమితమైపోయారు. జిల్లాలోని భారతీయ జనతాపార్టీ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా...  సీపీఐ వంటి జాతీయ పార్టీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది. బీజేపీలో నిధుల దుర్వినియోగం వ్యవహారం ఢిల్లీ వరకూ చేరింది. ఈ వ్యవహారాలన్నింటిపైనా ఆయా పార్టీల్లో ఇప్పుడు పంచాయితీ మొదలైంది. జిల్లాలో ఎన్నికల ముందు బీజేపీ కొంత ఉత్సాహంగానే కనిపించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడైన అమిత్‌షా కూడా విజయనగరం వచ్చి బహిరంగ సభ నిర్వహించారు. గెలుపుపై ఆ పార్టీ అభ్యర్థులు ఆశలు కూడా పెట్టుకున్నారు. అయితే జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడి కారణంగా గెలిచే అభ్యర్థులకు టిక్కెట్లు దక్కలేదనేది వివాదానికి కారణమైంది.

పార్టీ కోసం పనిచేసేవారిని ఒక్కొక్కరుగా బయటకు పంపించేసి ఒక నియంతలా ఆయన వ్యవహరించడంతో పాటు జిల్లాలోని బీజేపీ అభ్యర్థులకు ఇవ్వాల్సిన పార్టీ ఫండ్‌ను పూర్తిగా ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు లేవనెత్తారు. రాష్ట్రంలోని 175 స్థానాలకు పంచాల్సిన పార్టీ ఫండ్‌ రూ.30 కోట్లు దుర్వినియోగం అయ్యిందని, దానిలో జిల్లాకు చెందిన ఆ రాష్ట్ర నాయకుడి వాటా రూ.4 కోట్లు అని బీజేపీ అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందాయి. అంతేగాకుండా ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి బీజేపీ జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున గతంలోనే ఇచ్చింది. ఈ నిధులతో జిల్లాలో ఓ భవనాన్ని కొనుగోలు చేశారు. ఎన్నికల ముందు దానిని కూల్చి కొత్తభవన నిర్మాణాన్ని మొదలుపెట్టారు. దీనికి సంబంధించి కోర్‌ కమిటీ సమావేశం జరగలేదు. ఎలాంటి లెక్కలు జిల్లా పార్టీ సభ్యులకు తెలియజేయలేదు. తద్వారా ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నారనేది మరో ఆరోపణ.
 
అమిత్‌షాకు ఫిర్యాదు
జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమికి కారణాలను కూడా జిల్లా పార్టీ నేతలు అమిత్‌షాకు వివరించారు. కురుపాంలో నిమ్మక జయరాజ్‌కు రాష్ట్ర నాయకత్వం నుంచి ప్రోత్సాహం లేకపోయిందనీ, పార్వతీపురంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పట్నాసింగ్‌ రవికుమార్‌ను పక్కనపెట్టి కేవలం పదిరోజుల ముందు వచ్చిన టీడీపీ నేత సురగల ఉమామహేశ్వరరావుకు టిక్కెట్‌ ఇచ్చారనీ, బొబ్బిలికి చెందిన జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహన్‌రావుకు ఏమాత్రం పరిచయాలు లేని గజపతినగరం టిక్కెట్‌ ఇచ్చారనీ, విజయనగరంలో జిల్లా మాజీ అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌ను కాదని కురిమినేని దామోదర్‌ పేరును పరిశీలించినా చివరి నిమిషంలో కుసుమంచి సుబ్బారావును అభ్యర్థిగా ప్రకటించారని ఇవన్నీ వారి ఓటమికి కారణాలయ్యాయని తెలిపారు.

నెల్లిమర్లలో 25ఏళ్లుగా పార్టీలో ఉన్న కె.ఎన్‌.ఎం.కృష్ణారావును కాదని, ఎన్నికలకు నెల రోజుల ముందు వచ్చిన పతివాడ రమణకు టిక్కెట్టు ఇవ్వడంపై జిల్లా పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఎస్‌కోటలోనూ లెంక రామన్నపాత్రుడిని పక్కనపెట్టి పరిచయం లేని వ్యక్తికి టిక్కెట్టు కేటాయించడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని అమిత్‌షాకు వివరించారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ స్వయంకృతాపరాధం వల్లనే అభ్యర్థులు ఘోరపరాజయం పాలయ్యారని విశ్లేషించుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి ఈ అనర్థాలన్నిటికీ జిల్లాకు చెందిన రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు కారణమని ఫిర్యాదు చేశారు. జిల్లా పార్టీకి చెందిన 76 మంది నాయకులు ఆ ఫిర్యాదుకు మద్దతుగా సంతకాలు కూడా చేశారు.
 
సీపీఐలో అంతర్గత విభేదాలు
జిల్లా సీపీఐలో 2017 వరకు పి.కామేశ్వరరావు జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు. 2018లో జిల్లా కార్యవర్గం నూతన ఎన్నికల్లో బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఒమ్మి రమణను జిల్లాకార్యదర్శిగా ఎన్నుకున్నారు. నూతన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. ఎన్నికల తర్వాత నుండి పార్టీలో వర్గవిభేదాలు మొదలయ్యాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలో కార్యదర్శి స్థానికంగా ఉండకపోవటం, అందిరినీ కలుపుకుని ముందుకు వెళ్లక పోవటం వల్ల పార్టీలో వివాదాలు తలెత్తుతున్నాయనేది ఒక వర్గం వాదన.

పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాలు కార్యచరణలో కూడా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈ కారణంగా జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజుదొర, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి.జీవా తదితరులు జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఒమ్మి రమణను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీ నుంచి ఈ ముగ్గురిని దూరం  చేసేందుకు కార్యదర్శి రమణ కూడా అంతేస్థాయిలో ఆలోచిస్తున్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో రెండు జాతీయ పార్టీల్లో పరిస్థితి ఇలా మారిపోవడంతో వాటి భవిష్యత్‌పైనా కార్యకర్తల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top