హనుమంతు, శ్రీరామమూర్తి (ఫైల్)
మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం అడిగొప్పలలో ఘటన
అన్నదమ్ములు హనుమంతు, శ్రీరామమూర్తిని ఆదివారం రాత్రి హత్య చేసిన ప్రత్యర్థులు
ఒకే సామాజికవర్గానికి చెందిన టీడీపీ నాయకుల మధ్య వర్గపోరుతోనే హత్యలు జరిగినట్టు అనుమానం
సాక్షి టాస్క్‌ఫోర్స్: తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు మరో ఇద్దరిని బలితీసుకుంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జంట హత్యలు మరువకముందే దుర్గి మండలం అడిగొప్పలలో ఓ వర్గం మరో వర్గంలోని ఇరువురు సోదరులను హతమార్చింది. ఈ జంట హత్యలు పల్నాడును ఉలికిపాటుకు గురి చేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీలో అంతర్గతపోరు తారాస్థాయికి చేరి హత్యాకాండలకు ఉసిగొల్పుతోంది. పోలీసుల కథనం ప్రకారం... పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ములను ప్రత్యర్థులు ఒకరి తర్వాత మరొకరిని అత్యంత దారుణంగా వేటకొడవళ్లతో నరికి హతమార్చారు.
కొత్త శ్రీరామమూర్తి (33) గ్రామంలోని శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయం వాటర్ ప్లాంట్ వద్ద ఉండగా అదే గ్రామనికి చెందిన టీడీపీ నాయకుడు యాగంటి నరేష్ తన అనుచరులతో కలిసి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాడు. అనంతరం శ్రీరామమూర్తి సోదరుడు కొత్త హనుమంతు (30) అడిగొప్పల గ్రామంలోని బొడ్డురాయి సెంటర్ వద్ద ఉన్నాడని తెలుసుకుని నరేష్ తోడల్లుడు రామలింగం, అతని స్నేహితుడు వెంకటేష్ ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కారంపూడి సీఐ టి.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
మృతుల తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో 11 మందిపై కేసు నమోదు చేశారు. సోమవారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు గ్రామంలోని సంఘటనా స్థలాలను పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. మృతుల్లో కొత్త శ్రీరామమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలుండగా కొత్త హనుమంతరావు అవివాహితుడు.
ఆధిపత్య పోరుతోనే హత్యలు..?
శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఒప్పంద ఉద్యోగుల నియామకాల్లో జరిగిన ఆధిపత్య పోరుతోనే జంట హత్యలు జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన అన్నదమ్ములు ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడు యాగంటి నరేష్ అత్తతో గొడవపడ్డారు. కొంతకాలంగా ఆలయంలో ఒప్పంద ఉద్యోగుల నియామకంలో మృతులు, ప్రత్యర్థుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఆలయంపై ఆధిపత్యం చెలాయించాలంటే శ్రీరామమూర్తి, హనుమంతు అడ్డు తొలగించుకోవాలని భావించిన నరేష్ హత్యలకు పథక రచన చేశాడు.
అన్నదమ్ములిద్దరు వేర్వేరు చోట్ల ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలుసుకుని మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. అనంతరం పరారయ్యారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహా్మరెడ్డి అసమర్థతతోనే హత్యలు జరుగుతున్నాయని... నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న ఆధిపత్య పోరును పరిష్కరించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన అసమర్థతతో జరుగుతున్న హత్యలను ప్రతిపక్ష పార్టీ నేతలపైకి నెట్టి రాజకీయ కక్షలను తీర్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.


