బీసీలు ఐక్యమైతేనే రాజ్యాధికారం

Bc Meeting held at the SomagiGuda Press Club - Sakshi

సమావేశంలో పలువురు వక్తలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీ లు ఐక్యమైతేనే రాజ్యాధికారం సాధించవచ్చని పలువురు వక్తలు ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాధికార సాధనకు బీసీలందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని, అందుకోసం బీసీ అభ్యర్థులు లేకుండా గెలిచే అవకాశాలున్న చోట స్వతంత్రంగా పోటీచేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, పలు బీసీ కులాలతో కలిసి మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు జస్టిస్‌ చంద్రకుమార్, బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య, ఉద్యమకారుడు సాంబశివరావు, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఏఎల్‌ మల్లయ్య, బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణలు పాల్గొన్నారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. దేశంలో 70 ఏళ్ల నుంచి అసమానతలు తొలగిపోవాలని ఎన్నో పోరాటాలు జరుగుతు న్నా అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయన్నారు.

ఎస్సీ,ఎస్టీ,బీసీల్లో ఐకమత్యం లేకపోవడం, సరైన నాయకుడు లేకపోవడంవల్లే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల్లో ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లు ఎక్కని కులాలను గుర్తించి అన్ని పార్టీలు వారికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం గూర్చి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లానని, ప్రస్తుతం ఉన్న జనాభాకు అనుగుణంగా మరో 240 సీట్లు పెంచి బీసీలకు అవకాశం కలిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు.

అన్నిపార్టీలు బీసీల వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్‌ చేశా రు. ఎంబీసీ కులాలకు నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, సామాజిక వేత్తలు, దుగ్యాల అశోక్, టీవీ రామనర్సయ్య, రిటైర్డ్‌ డీఐజీ నాగన్న, కోల శ్రీనివాస్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top