బిహార్‌లో సీట్ల కేటాయింపు మొదలు హామీల వరకు కుల సమీకరణాలే ప్రాతిపదిక
2023 కుల గణనతో పూర్తిగా మారిన రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం
గెలుపోటములను శాసించేది 63 శాతంగా ఉన్న బీసీలు, ఈబీసీలే
‘ముస్లిం–యాదవ్’సమీకరణాన్ని నమ్ముకున్న ‘మహాగఠ్‌బంధన్’
అగ్ర వర్ణాలు, ‘లవ్–కుష్’తో పాటు ఈబీసీల మద్దతుపై ఎన్డీయే ఆశలు
సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల బిహార్ లో మరోమారు సం‘కుల’సమరానికి అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలు సహా అన్ని పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలో మరోమారు కుల గణాంకాలతో పోటీపడుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల హామీలు ఒకవైపు వినిపిస్తు న్నా..తెర వెనుక అసలైన రాజకీయం కులసమీ కరణాల చుట్టూనే తిరుగుతోంది.
ముఖ్యంగా 2023లో నితీశ్ కుమార్ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక, ఎన్నికల స్వరూపాన్నే సమూలంగా మార్చేసింది. జనాభాలో కులాల బలాల ఆధారంగా అన్ని పార్టీలూ తమ వ్యూహాలకు కొత్తగా పదును పెడుతున్నాయి. ‘జిత్నీ ఆబాదీ, ఉత్నీ హిస్సేదారీ‘(ఎంత జనాభా ఉంటే అంత వాటా) అనే నినాదం ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో మారుమోగుతోంది.
సగం సీట్లు అగ్రకులాలకే..
రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమంతా కులాల చుట్టూతే తిరుగుతుండటంతో అన్ని పక్షాలు సీట్ల కేటాయింపుల్లో వీటి ఆధారంగానే పంపకాలు చేపట్టాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో ఈబీసీలు 36 శాతం, ఓబీసీలు 27శాతం మంది ఉన్నారు. ఈ అంకెలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ తాను ప్రకటించిన 101 మంది అభ్యర్థులలో 35 మంది ఈబీసీ, ఓబీసీ కులాలకే టికెట్లు కేటాయించింది.
ఇందులోనూ అత్యంత కీలకమైన కుష్వాహా, కుర్మీ కులాలకు చెందిన 12 మందిని పోటీలో పెట్టింది. గత ఎన్నికల్లో ఈ కులాలకు కేవలం 10 సీట్లిచ్చిన బీజేపీ ఈసారి వారికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. ఇక బీజేపీకి ఆయువు పట్టుగా ఉన్న రాజ్‌పుత్, భూమిహార్, బ్రాహ్మణులు, Ð వైశ్య కులాలకు చెందిన 49 మందిని పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేయగా, అందులో 50 మంది అగ్రకులస్థులకు టికెట్లు ఇచ్చింది. ఈసారీ అదే ప్రాధాన్యాన్ని కొనసాగించింది.
మొత్తంగా 13 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా, అందులో ఏడుగురు బీసీలున్నారు. ఇక జేడీయూకి చెందిన 101 మంది అభ్యర్థుల్లో 59 మంది ఈబీసీ, ఓబీసీ కులాలవారే ఉన్నారు. ఇందులోనూ కుష్వాహా కులానికి చెందిన వారు 13 మంది, కుర్మీలు 12 మంది ఉన్నారు. 14.26 శాతంగా యాదవ కులస్థులు మొద ట్నుంచి ఆర్‌జేడీకి మద్దతుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో 10 సీట్లు కేటాయించిన జేడీయూ ఈసారి మాత్రం 8 సీట్లతో సరిపెట్టి, ఇతర కులాలకు చోటు కల్పించింది.
రిజర్వేషన్లు.. అధికారంలో వాటా
రాష్ట్రంలో 2023లో కులగణన లెక్కలు రాజకీయ పార్టీల అంచనాలను తలకిందులు చేశాయి. రాష్ట్ర జనాభాలో మూడో వంతుకు పైగా ఉన్న ఈబీసీలు ఇప్పుడు ‘కింగ్ మేకర్‘పాత్ర పోషించనున్నాయి. దశాబ్దాలుగా నితీశ్ కుమార్‌కు అండగా నిలిచిన ఈ వర్గం, ఇప్పుడు తమ జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం గట్టిగా పట్టుబడుతోంది. ఇదే అంశం ఇప్పుడు రెండు ప్రధాన కూటముల గెలుపోటములను నిర్ణయించనుంది. ప్రస్తుత ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ తన సంప్రదాయ ఓటు బ్యాంకుపై గట్టి నమ్మకంతో ఉంది.
ఆర్జేడీకి ఎప్పటినుంచో ‘ముస్లిం–యాదవ్’సమీకరణం పెట్టని కోట. రాష్ట్రంలో యాదవులు (14.3 శాతం), ముస్లింలు (17.7 శాతం) కలిసి దాదాపు 32 శాతం పటిష్టమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వీటికి తోడు కుల గణనను అస్త్రంగా మలుచుకుంటూ, 63 శాతంగా ఉన్న ఓబీసీ, ఈబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, అధికారంలో వాటా ఇస్తామని బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ కూటమిలో చేరిన ముఖేష్ సహానీ (వీఐపీ పార్టీ) ద్వారా ఈబీసీ వర్గాల్లో కీలకమైన నిషాద్ (మల్లా) కమ్యూనిటీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు తమ సంప్రదాయ ఓట్లను కూటమికి బదిలీ చేస్తాయని భావిస్తున్నారు.
మరోసారి అదే సమీకరణం
అధికార ఎన్‌డీయేలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ(ఆర్‌వి), హామ్, ఆర్‌ఎల్‌ఎంల కూటమి... ప్రత్యర్థి ఓటు బ్యాంకును చీల్చడంతో పాటు, తమ సామాజిక వర్గాలను ఏకం చేసే పకడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగింది. బీజేపీకి సంప్రదాయంగా అగ్ర వర్ణాల (15.4 శాతం) ఓటు బ్యాంకు ఉంది. కుల గణన తర్వాత, వారు కూడా తమ వ్యూహాన్ని మార్చి ఈబీసీ, ఓబీసీ వర్గాలకు అభ్యర్థుల జాబితాలో పెద్ద పీట వేస్తూ ‘సోషల్ ఇంజనీరింగ్’చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలం ‘లవ్–కుష్‘(కుర్మి– 2.87 శాతం, కుష్వాహా/కోయిరి –4.2 శాతం) సమీకరణం.
అన్నింటి కంటే ముఖ్యంగా, దశాబ్దాలుగా ఆయనను నమ్ముకున్న 36 శాతం ఈబీసీ ఓటు బ్యాంకే ఆయనకు శ్రీరామరక్షగా భావిస్తున్నారు. మిత్రపక్షమైన చిరాగ్ పాశ్వాన్ దళితులలో బలమైన వర్గమైన దుసాధ్ ఓట్లను (సుమారు 5.5 శాతం) ఎన్డీయే వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జితన్ రామ్ మాంఝీ పార్టీ ప్రధానంగా మహాదళితుల (ముఖ్యంగా ముసహర్– 3 శాతం) ఓట్లను కూటమికి అందివ్వనుండగా, ఉపేంద్ర కుష్వాహా (ఆర్‌ఎల్‌ఎం): ‘లవ్–కుష్’స మీకరణంలోని కుష్వాహా ఓట్లను మరింత గట్టిగా ఏకీకృతం చేయనున్నారు.
గెలుపు ఎవరిది అంటే?
బిహార్‌లో ఈసారి పోరు నువ్వా–నేనా అన్నట్లుగా ఉంది. ఆర్జేడీకి ‘ముస్లిం–యాదవ్’రూపంలో 32 శాతం బలమైన పునాది ఉండగా, ఎన్డీయేకు అగ్ర వర్ణాలు, లవ్–కుష్, దళిత, మహాదళిత వర్గాల రూపంలో విస్తతమైన మద్దతు ఉంది. అయితే, ఈ రెండు కూటముల తలరాతను మార్చే శక్తి మాత్రం 36 శాతం జనాభా ఉన్న ఈబీసీ వర్గాల చేతుల్లోనే ఉంది. గతంలో నితీశ్ వైపు నిలిచిన ఈ వర్గం, ఈసారి కుల గణన తర్వాత ఎటువైపు మొగ్గు చూపుతుంది? తేజస్వి యాదవ్ ఇస్తున్న ‘అధికార వాటా‘హామీని నమ్ముతుందా? లేక నితీశ్ కుమార్ నాయకత్వం, మోదీ సంక్షేమ పథకాల వైపు నిలుస్తుందా? అన్నదే బిహార్ ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించనుంది.
సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)


