అప్పుల కుప్పలా తెలంగాణ: భట్టి విక్రమార్క | Sakshi
Sakshi News home page

Published Wed, May 16 2018 6:41 PM

Battivikramark Criticize On CM KCR - Sakshi

సాక్షి, అసిఫాబాద్‌ : మిషన్‌ భగీరథ పథకం పేరుతో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. ఆయన బుధవారం అసిఫాబాద్‌లో  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు మంచి నీళ్లు అందించాలనే సంకల్పంతో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాగునీటి పథకాలకు భగీరథ అనే పేరు మార్చి నిర్వీరం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు మొదలు పెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కమీషన్ల కోసమే రీడిజైన్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం ప్రాణహిత-చేళ్లతో పాటు, రాజీవ్‌, ఇందిరా సాగర్‌ ప్రాజెక్టులను మొదలు పెట్టి 70 నుంచి 80 శాతం పూర్తి చేసిందని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక  ప్రాజెక్టుల్లో చుక్కనీరు లేకుండా చేసిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలా మారిపోవడం ఖాయమని భట్టి అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఇంటికి పంపాలని ప్రజలకు భట్టి పిలుపు ఇచ్చారు.

Advertisement
Advertisement