బీజేపీ బండికి.. సంజయుడే సారథి

Bandi Sanjay Appointed As Telangana BJP President - Sakshi

తీవ్ర పోటీ ఉన్నా సంజయ్‌వైపే అధిష్టానం, ఆర్‌ఎస్‌ఎస్‌ మొగ్గు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బీజేపీకి బండి సంజయ్‌ సారథి అయ్యారు. హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో, టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కోవడంలో ముందుండటంతో జాతీయ నాయకత్వం సంజయ్‌ వైపు మొగ్గు చూపింది. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న అనుబంధం, పార్టీ ఆదేశాలను తు.చ. తప్పకుండా పని చేసే నేతగా, పక్కా హిందూత్వవాదిగా పేరుండటంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ సంజయ్‌ను బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, హెడ్‌ క్వార్టర్స్‌ ఇన్‌చార్జి అరుణ్‌సింగ్‌ నియామక పత్రం జారీ చేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సంజయ్‌కి యువతలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

తీవ్ర పోటీ ఉన్నా... 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది కొంతకాలంగా హాట్‌ టాపిక్‌గా మారింది. రెండోసారి అధ్యక్ష పదవి కోసం కె.లక్ష్మణ్‌ తీవ్రంగా ప్రయత్నించారు. ఇటు మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో ఉన్న జాతీయ పార్టీ.. రాష్ట్రంలో హిందుత్వ ఎజెండా అమలు, పార్టీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బలోపేతం చేసేందుకు సంజయ్‌కే ఈ పదవి ఇస్తారన్న ఊహగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక నాయకత్వంతో చర్చించిన పార్టీ అధినాయకత్వం సంజయ్‌కే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. చివరివరకు లక్ష్మణ్‌ పేరు పరిశీలనలో ఉన్నా జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పూర్తిస్థాయిలో సంజయ్‌వైపై మొగ్గు చూపినట్లు తెలిసింది. 

సంస్థాగతంగా బలోపేతం: లక్ష్మణ్‌ 
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్‌ నియమితులు కావడం పట్ల కె.లక్ష్మణ్‌ అభినందనలు తెలిపారు. బండి సంజయ్‌ నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో సంస్థాగతంగా బలోపేతమవుతుందని పేర్కొనారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2023లో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు సంజయ్‌ కృషి చేస్తారని ఆకాంక్షించారు.

బయోడేటా.. 
పేరు: బండి సంజయ్‌ కుమార్‌ 
పుట్టిన తేదీ: 1971, జూలై 11 
పుట్టిన స్థలం: కరీంనగర్‌ 
తల్లిదండ్రులు: శకుంతల, నర్సయ్య 
భార్య: అపర్ణ (ఎస్‌బీఐ ఉద్యోగిని) 
పిల్లలు: భగీరథ్, సుముఖ్‌ 
విద్యార్హతలు: ఎంఏ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top