‘సికింద్రాబాద్‌ నుంచి నేనే పోటీ చేస్తా’

Bandaru Dattatreya Says He will Contest From Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి తాను బరిలో ఉన్నానని బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ అన్నారు. అయితే అదిష్టానం ఆదేశిస్తేనే పోటీచేస్తానని, ఒకవేళ తనను కాదని వేరే వారి పేరును ప్రకటించిన కూడా అభ్యంతరం లేదని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 17 పార్లమెంట్‌ స్థానాల నుంచి బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే తమ పార్టీయే ముందంజలో ఉందన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ సహకారం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో అన్ని సమస్యల పరిష్కారం నరేంద్ర మోదీ ఒక్కడి వల్లనే సాధ్యమవుతందన్న విశ్వాసం ప్రజల్లో రోజురోజుకు బలపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బలం పెరగడమే కాకుండా బీజేపీ సొంతంగా 300 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్య చెప్పారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు మహాకూటమి అనే ఏర్పాటును పక్కన పెట్టి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. తన పార్టీ గెలుపుపై నమ్మకం కోల్పోయిన చంద్రబాబు కలవరపాటుకు గురై దేశ రాజకీయాలను పక్కకు పెట్టి వచ్చారన్నారు. టీఆర్‌ఎస్‌ సొంతబలంతో కాకుండా అద్దె బలంతో గెలుచుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. త్వరలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వచ్చి ప్రచారం చేస్తారని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top