‘నా తండ్రికి ఏం జరిగినా అఖిలప్రియదే బాధ్యత’

AV Subba Reddy Daughter Jaswanti Reddy Slams Bhuma Akhila Priya - Sakshi

సాక్షి, ఆళ్లగడ‍్డ : తన తండ్రికి ఏం జరిగినా అందుకు మంత్రి అఖిలప్రియే బాధ్యత వహించాలని టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డి అన్నారు. అఖిలప్రియ తన వాహనాలపై భూమా స్టిక‍్కర్‌ తీసివేసి మంత్రి అఖిలప్రియగా పెట్టుకోవాలని ఆమె సూచించారు. ‘మా నాన్న భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఎంతో సేవ చేశాడు. ర్యాలీ సందర్భంగా నాన్నపై దాడి జరగడం చాలా బాధ కలిగించింది. నాన్నకు ఏదైనా జరిగింతే అఖిలక్కా నువ్వు బాధ్యత తీసుకుంటావా?. మామా మామా అంటూ మా నాన్నకు ఇచ్చే గౌరవం ఇదా?. మీడియా ముందు మాత్రం మేమంతా కలిసిపోయాం అని చెబుతావు. వెనుక మాత్రం చేయాల్సింది చేస్తున్నావ్‌. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నా?. నాన్న కన్నా అఖిలప్రియ 35ఏళ్లు చిన్నది. కనీసం నాన్న వయసు అయినా గౌరవం ఇవ్వడం నేర్చుకో.’ అని జశ్వంతి రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా ఆళ్లగడ్డలో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్న విషయం విదితమే. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా  ఏవీ సుబ్బారెడ్డి మీద నిన్న రాళ్ళ దాడి జరగడం కలకలం రేపుతోంది. అయితే ఆ దాడి భూమా అఖిలప్రియ వర్గీయులే  చేశారని సుబ్బారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి తనపై దాడి జరిగి 24 గంటలు దాటినా ఇప్పటివరకూ దుండగులను పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. రాళ్లదాడికి కారకులైన మంత్రి అఖిలప్రియపై కేసు ఎందుకు నమోదు చేయలేదన్నారు. ఈ కేసును నీరుగార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు ఈ పంచాయితీ పార్టీ అధిష్టానం వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో మంగళవారం అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డి అమరావతి రావాల్సిందిగా ఆదేశాలు అందాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top