తెలంగాణలో బీజేపీ బలపడలేదు 

Asaduddin Owaisi Says BJP is not strong in Telangana - Sakshi

కేసీఆర్‌ పాలన ఉన్నంతకాలం మోదీ, షా ఆశలు కల్లలే

తెలంగాణ ప్రజలు సంఘ్‌పరివార్‌ యత్నాలను తిప్పికొడతారు

సామాన్యులపై కేంద్రం బడ్జెట్‌ భారం మోపింది

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ  

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ పాలన ఉన్నంతకాలం తెలంగాణలో పాగా వేయటం బీజేపీకి అసాధ్యమని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేసీఆర్‌ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీ అధినేతను ఢీకొనలేరని తేల్చి చెప్పారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్నేహభావంతో మెలిగే తత్వం ఉన్న తెలంగాణ ప్రజలు, విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను ఆదరించరని, సంఘ్‌పరివార్‌ ఆలోచనలను తిప్పిగొడతారన్నారు. గత ఐదేళ్లుగా ముస్లింలు, బడుగు బలహీనవర్గాలు, గిరిజనుల విద్యకోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలతో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్‌కు ప్రజలు అండగా ఉంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

పార్టీ సభ్యత్వ నమోదు కోసం బీజేపీ అధినేత అమిత్‌షా తెలంగాణకు రావటం ఆ పార్టీ అంతర్గత విషయమని, దాన్ని పట్టించుకోనన్నారు. కానీ, తెలంగాణలో పాగా వేసే చర్యల్లో భాగంగానే అమిత్‌షా ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణకు వచ్చినట్టయితే వారికి ఆశాభంగం తప్పదని ఆయన పేర్కొన్నారు. అత్యంత బలీయమైన శక్తిగా ప్రాంతీయ పార్టీలున్న ఒడిషా, తమిళనాడు, తెలంగాణలాంటి ప్రాంతాల్లో బీజేపీ ఎన్నటికీ విజయం సాధించలేదని, ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ కనుమరుగై ప్రాంతీయ పార్టీల హవా సాగుతోందన్నారు. గత ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ గెలవటం ఆ పార్టీ బలంగా ఉండటం వల్ల కాదని, మూడు చోట్ల అతి విశ్వాసం, ఒక స్థానంలో సరైన అభ్యర్థి లేకపోవటం టీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమని అసదుద్దీన్‌ పరోక్షంగా పేర్కొన్నారు.
 
ఇక భారీ విజయంతో వచ్చిన అహంకారం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోందని, ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారని అసదుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఎమ్మెల్యే దాడికి పాల్పడటం, ఆయన మనుషులు తుపాకీతో రెచ్చిపోవటం ఇందులో భాగమేనన్నారు. అది మంచి పద్ధతి కాదంటూ ప్రధాని నరేంద్రమోదీ ఖండించిన వెంటనే ఆగ్రా వెళ్లే దారిలో ఓ ఎంపీ అనుచరులు టోల్‌ సిబ్బందిపై దాడికి పాల్పడటం ఆ పార్టీ నాయకుల వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు. ఎన్నికల్లో సులభంగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టే నేతలు, టోల్‌ వద్ద రూ.50 చెల్లించేందుకు మనసు ఒప్పదా అని ప్రశ్నించారు. సోమవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరోసారి ప్రధాని ‘ఈ తీరు నచ్చదు’అని అంటారంటూ ఎద్దేవా చేశారు.  

బడ్జెట్‌తో సామాన్యుని నడ్డి విరిచింది 
ఇక కేంద్ర బడ్జెట్‌ తీవ్రంగా నిరాశపరిచిందని, పేద ప్రజలపై ప్రేమ ఒలకబోసే మాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో వారిపై భారం మోపిందన్నారు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల పేదలకు అశనిపాతమే అవుతుందన్నారు. ఆదాయపన్నుపై సర్‌ఛార్జి కూడా భారంగా మారుతుందన్నారు. మోదీ తరచూ చెప్పే నారీ శక్తి మాటలకు, బడ్జెట్‌లో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చూస్తే ఎక్కడా పొంతన కనిపించదని విమర్శించారు. న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్‌ డ్యూటీ పెంపు, పుస్తకాల ధరలకు రెక్కలొచ్చే నిర్ణయాలు సరికాదని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కోటి మంది ముస్లిం విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అంటూ ఘనంగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం, వారికి అందించే ప్రీ మెట్రిక్, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌లో కోత పెట్టిందని విమర్శించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావనే లేదన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top