చట్టాలతో చిట్టా పద్దులు

Arun Jaitley Profile of A Legal Luminary - Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : విపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షాలను ముప్పితిప్పలు పెట్ట గల సమర్థమైన నాయకుడు అరుణ్‌ జైట్లీ. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా అందరికి సుపరిచితులైన జైట్లీ.. కీలకమైన అనేక కేసులను వాదించిన చరిత్ర గల న్యాయకోవిధుడు. ప్రస్తుతం బీజేపీలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఒకరైన అరుణ్ జైట్లీ... కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీకి నమ్మిన బంటు. మోదీ కేబినెట్‌లో అత్యంత కీలకమైన శాఖలు చేపట్టిన సమర్థుడైన నేత. న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి..  కేంద్రమంత్రి, రాజ్యసభ ప్రతిపక్షనేత, క్యాబినేట్‌ హోదా వంటి అనేక అత్యున్నత పదవులను జైట్లీ అధిరోహించారు.

1991లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జైట్లీ.. అనతికాలంలోనే బీజేపీలో ముఖ్యనేతగా ఎదిగారు. మాజీ ప్రధాని వాజపేయి మంత్రివర్గంలో తొలిసారి కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీకి న్యాయవాద వృత్తిలో విశేష అనుభవం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో జైట్లీ తొలుత రక్షణ శాఖ, ఆ తరువాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం రాజ్యసభ నుంచి ప్రాతినిథ్యం వ్యవహరిస్తున్నారు. కేంద్రమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై విమర్శనాస్ర్తాలు సందించడంలో జైట్లీ దిట్ట. సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా విశేష అనుభవం ఉండడంతో పార్టీ లీగల్‌ సెల్‌కు వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకడి పాత్రను జైట్లీ సమర్థవంతంగా పోషించారు. విపక్ష హోదాలో ఉన్నప్పుడు అధికార పక్షంను ఇరకాట పెట్టడంలో జైట్లీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ప్రత్యర్థిపై వ్యహాలు రచించడంలో దిట్టగా పేరొందిన జైట్లీ.. ఈసారి పార్టీ గెలుపుకు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో వేచి చూడాలి.

రాజకీయ ప్రస్థానం..
విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక పోరాటాలకు జైట్లీ నాయకత్వం వహించారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. న్యాయవాదిగా అనుభవం ఉండటంతో మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌ హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తొలిసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  సమాచార శాఖమంత్రిగా ఆయన సేవలందించారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ క్రికెట్‌ అసోషియేషన్‌కు చైర్మన్‌కు ఉ‍న్న సమయంలో జైట్లీ అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద దుమారం చెలరేగాయి. దీంతో కేజ్రీవాల్‌పై జైట్లీ ఢిల్లీ హైకోర్టులో పరవునష్టం దావావేసి కోర్టుముందు నిల్చోబెట్టారు.. ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌పై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్‌ చేసి సంచలనం సృష్టించారు. కొచ్చర్‌ వీడియోకాన్‌ సంస్థకు అక్రమంగా నిధులను మళ్లించారని జైట్లీ ఆరోపించారు.

కుటుంబ నేపథ్యం..
అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్త ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం గుజరాత్‌లో స్థిరపడ్డారు. ఇతని తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. జమ్మూ కశ్మీర్‌ మాజీ ఆర్థిక మంత్రి గిరిదాల్‌ లాల్‌ కుమార్తె సంగీత జైట్లీని 1982లో వివాహం చేసుకున్నారు.  పిల్లలు సోనాలీ జైట్లీ, రోహన్‌ జైట్లీ. ఇద్దరూ కూడా లాయర్లే కావడం విశేషం. కిడ్నీ సంబందిత వ్యాధితో భాదపడుతున్న జైట్లీ ఇటీవల అమెరికాలో శస్త్ర చికిత్స కూడా తీసుకున్నారు. దాని కారణంగానే 2019 ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెన్‌ను ప్రవేశపెట్టలేక పోయారు. 
-సురేష్‌ అల్లిక

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top