జాబితాలో పేరు ఇచ్చి.. మాట మారుస్తారా..!

Arguments On AP Intelligence Director General Transfer In AP High Court - Sakshi

ఏపీ హైకోర్టులో ఎన్నికల కమిషన్‌ వాదన

తీర్పును రిజర్వు చేసిన ఉన్నత న్యాయస్థానం

సాక్షి, అమరావతి : ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్‌ డీజీ ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి రారని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 721లో చెప్పింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో గురువారం వాదనలు మొదలయ్యాయి. ఇంటెలిజెన్స్‌ డీజీ ఎన్నికల విధుల్లో లేరంటూ వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ప్రమాణపత్రం సమర్పించింది. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే సదరు అధికారుల బదిలీకి నోటీసులు ఇచ్చామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇంటలిజెన్స్‌ చీఫ్‌ లేకుండా పోలీస్‌ శాఖ ఎలా ఉంటుందని, వారి నివేదికల ద్వారానే పోలీస్‌శాఖ నడుస్తుంది కదా అని స్పష్టం చేశారు. ఎన్నికల భద్రతా, పోలింగ్‌ పర్యవేక్షణ ఇంటలిజెన్స్‌ నిఘా లేకుండా ఎలా ఉంటుందని వాదించారు. సెక్షన్‌ 28-ఏ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాలో ఏపీ ప్రభుత్వం ఇంటలిజెన్స్‌ డీజీ పేరును కూడా ఇచ్చిందని కోర్టుకు విన్నవించారు. కాగా, దీనిపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇస్తూ.. పొరపాటుగా ఇంటలిజెన్స్‌ పేరు ఇచ్చామని సమర్ధించుకుంది. 716 జీవో ప్రకారం ఇద్దరు ఎస్పీలను, ఇంటలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన ప్రభుత్వం.. జీవో నెం. 720 జారీ చేసి ఇంటలిజెన్స్‌ డీజీ బదిలీని పక్కన పెట్టడంలో ఉద్దేశమేమిటని అన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

(చదండి : ఇంటెలిజెన్స్‌..పోలీస్‌ వ్యవస్థలో భాగమే)

(చదండి : సీఈసీ ఆదేశాలు బేఖాతరు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top