స్పీకర్‌ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం

AP Speaker Asks Probe on Amaravati Lands, CM Says Okay - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతిలో టీడీపీ నేతల భూకొనుగొళ్ల బండారం బయటపెడుతూ ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సభాపతి తమ్మినేని సీతారాం స్పందించారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని వివరిస్తూ.. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు దోచుకున్న భూముల వివరాలను రాజేంద్రనాథ్‌ సభముందు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పీకర్‌ స్పందిస్తూ.. అమరావతి భూముల వ్యవహారంపై ప్రజలకు నిజానిజాలు తెలిసేందుకు, నిజాలు నిగ్గుతేల్చేందుకు పకడ్బందీగా సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. దీనికి సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. సభాపతి నుంచి వచ్చిన ఆదేశాలను  కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. శాసనసభకు ప్రత్యేక ఐడెంటిటీ ఉంటుందని, సభాపతికి క్వాజీ జ్యుడీషియల్‌ అధికారాలు ఉంటాయని, స్పీకర్‌ జడ్జితో సమానమని పేర్కొన్నారు. ఏదైన అంశంపై విచారణ చేపట్టాలని అడిగే అధికారం స్పీకర్‌కు ఉంటుందని స్పష్టం చేశారు.

మీకు అంత ఉలుకెందుకు?
అమరావతి భూకుంభకోణాలపై విచారణ జరపాలని స్పీకర్‌ కోరడంతో టీడీపీ సభ్యులు సభలో గగ్గోలు చేశారు. అచ్చెన్నాయుడు తదితర టీడీపీ సభ్యులు రాద్ధాంతం సృష్టించే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్‌ వారిమీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ..  సభాపతిగా విచారణ కోరే అధికారం తనకుందని, హద్దుమీరి టీడీపీ సభ్యులు మాట్లాడరాదని, హద్దుల్లో ఉండాలని మందలించారు. విచారణ జరిపించాలని కోరితే మీకెందుకు అంత ఉలుకు? అని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.  ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విచారణ కోరే అధికారం స్పీకర్‌కు ఉంటుందని, స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చెప్పినవారు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం తమ ఖర్మ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top