ఖాకీవనంలో ‘కుల’చిచ్చుపై పేలిన ఓటు తూట..

AP Police Against Chandrababu Naidu Ruling - Sakshi

చంద్రబాబు సొంత మనుషులుగా కొందరు ఐపీఎస్‌లు

కొన్ని సామాజికవర్గాలను టార్గెట్‌ చేసి అప్రధాన పోస్టులకే పరిమితం చేసిన వైనం

టీడీపీ పోకడలపై పోలీసుల్లో పెల్లుబికిన ఆగ్రహం

 వైఎస్సార్‌సీపీ గెలుపుపై పోలీసుల్లో ఉప్పొంగిన అభిమానం

సాక్షి, అమరావతి : మనమంతా ఖాకీ కులం అని సగర్వంగా కాలరెగరేసి చెప్పుకునే పోలీసుల్లో చంద్రబాబు ‘కుల’చిచ్చు రగిల్చడంపై ఆ శాఖ ఉద్యోగుల కుటుంబాల్లో ఆగ్రహం తెప్పించింది. వారంతా ఓటుతో బుద్ధిచెప్పారని ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగుల్లో ఫలితాలపై హర్షం వ్యక్తం అవుతోంది.  చంద్రబాబు సొంత మనుషులుగా చెలామణి అయిన కొందరు ఐపీఎస్‌ల కుల పోకడలతో పోలీస్‌ ఐక్యత దెబ్బతినే పరిస్థితి నెలకొంది. పలువురు పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా పనిచేయడం ఆ శాఖలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. చంద్రబాబు సొంత సామాజికవర్గంతో పాటు ఆయన సొంత మనుషులకే కీలక పోస్టులు కట్టబెట్టారు. చివరకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు, ఓఎస్డీలుగా యోగానంద్, మాధవరావు తదితర అధికారులు చంద్రబాబు డైరెక్షన్‌లో ఎన్నడులేని విధంగా పోలీసు శాఖలోను కులాల వారీ లెక్కలు తీయడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం.

అలాగే కొన్ని సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకుని అణచివేత ధోరణి అవలంభించారంటూ బాధితులు వాపోతున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఐదేళ్లుగా పోలీసు శాఖలో జరిగింది ఇదే. ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో దాదాపు 300 మందికి పైగా పోలీసు అధికారులను బలవంతంగా వేకెన్సీ రిజర్వ్‌ (వీఆర్‌)లోకి పంపారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. ఇది చాలదన్నట్టు అవినీతి నిర్మూలనకు దోహద పడాల్సిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని సైతం రాజకీయ, సామాజికవర్గాలను టార్గెట్‌ చేసేలా మార్చారు. ఖాకీ వనంలో చోటు చేసుకున్న పరిణామాలను దగ్గరగా గమనించిన పోలీసు కుటుంబాలు చంద్రబాబు పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలో పోలీసులకు చెందిన దాదాపు లక్ష కుటుంబాలు ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపాయి. హోంగార్డులకు మెరుగైన వేతనాలు, పోలీసులకు వీక్లీఆఫ్‌లు ఇస్తామన్న జగన్‌మోహన్‌రెడ్డి హామీ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన పోలీసు కుంటుంబాలు ఫ్యాన్‌ గుర్తుకు ‘ఫ్యాన్‌’గా మారిపోయాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top