ఎంత చెప్పినా సీఎం వినలేదు.. కోర్టుకెళ్లి తప్పు చేశాం..!

AP Government Disappointment In Intelligence DG Transfer Issue - Sakshi

అనవసరంగా బదనాం అయ్యాం

ఉన్నతాధికారుల అంతర్మథనం 

సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఆదేశాలను సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం తలబొప్పికట్టేలా చేసింది. దీంతో యూటర్న్‌ తీసుకుని రాష్ట్ర నిఘా విభాగం అధిపతి (ఇంటెలిజెన్స్‌ డీజీ) ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా విధులను పక్కనపెట్టి టీడీపీ సేవలో తరిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలను పాటించాల్సింది పోయి కోర్టులో సవాల్‌ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయిందనే అంశం ఉన్నతస్థాయి అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

సీఎం చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం తమను బదనాం చేశారని ఉన్నతాధికారులు మథనపడుతున్నారు. ముగ్గురు పోలీసు అధికారులను బదిలీచేస్తూ సీఈసీ ఇచ్చిన ఆదేశాలు, తదనంతర పరిణామాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలని అధికారులు ఎత్తి చూపుతున్నారు. ‘ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, వైఎస్సార్‌ జిల్లాల ఎస్పీలు ఎ.వెంకటరత్నం, రాహుల్‌దేవ్‌ శర్మను బదిలీచేస్తూ ఎన్నికల కమిషన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని ఎన్నికలకు సంబంధించిన విధులకు వీరిని దూరంగా పెట్టాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ వీరి ముగ్గురినీ బదిలీచేస్తూ మంగళవారం రాత్రి జీవో 716 జారీ చేశారు.  అయితే ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని జీర్ణించుకోలేకపోయిన సీఎం ఎలాగైనా దీనిని ఆపించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగానే జీవోను రద్దుచేసి  శ్రీకాకుళం, వైఎస్సార్‌ జిల్లాల ఎస్పీలను మాత్రమే బదిలీ చేయాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి రెండు జీవోలు ఇప్పించారు.

అలాగే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ పేరుతో ప్రభుత్వం తరఫున ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేయాలంటూ కోర్టులో కేసు వేయించారు. అసలు ఒక అధికారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ బదిలీ చేస్తే దానికి విరుద్ధంగా ఆయన కోర్టుకెళ్లవచ్చు. ఇందుకు భిన్నంగా ఎన్నికల కమిషన్‌ను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలా కోర్టుకు వెళుతుంది? దీని వెనుక ఆంతర్యం ఏమిటి? అనే సందేహాలు సాధారణంగానే అందరికీ కలిగేలా సీఎం చేశారు. జీవో ఎందుకు ఇచ్చారు? ఎందుకు రద్దు చేశారన్న జడ్జి ప్రశ్నలకు ఏజీ సమాధానమే ఇవ్వలేని పరిస్థితి. దీంతో అటు కోర్టులోనూ, ఇటు ఎన్నికల కమిషన్‌ వద్దా ప్రభుత్వ పరువును మంటలో కలిపినట్లయింది’ అని ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులు ‘సాక్షి’తో అన్నారు.  

ఇంతా చేసి సాధించిందేమిటి? 
దేశ చరిత్రలో ఎన్నడూ ఈసీ బదిలీలను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ కోర్టులో సవాల్‌ చేసిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి బాబు సర్కారు ఇలా సవాల్‌చేసి కోర్టులో సైతం అక్షింతలు వేయించుకోవాల్సి వచ్చింది. ఇంతా చేసి సాధించింది ఏమిటయ్యా అంటే రెండు చోట్లా పరువు పోగొట్టుకోవడమే. ఇది చాలదన్నట్లు తమను ఎందుకు బదిలీ చేశారో, తాము చేసిన తప్పు ఏమిటో చెప్పాలంటూ శ్రీకాకుళం, వైఎస్సార్‌ కడప ఎస్పీలు ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయడంపై మరో దుమారం రేగుతోంది. ఈ లేఖలను వారు ఇష్టపూర్వకంగా రాయలేదు. సీఎం ఒత్తిడి తెచ్చి రాయించారనేది ప్రస్తుతం ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చనీయాంశమైంది.  
ఈసీ వివరణ అడిగిన  దాఖలాలు ఎన్నడూ లేవు  
ఎన్నికల కమిషన్‌ ఎవరినైనా అధికారులను విధుల నుంచి తప్పించేప్పుడు వారి వివరణ కోరిన దాఖలాలు ఎన్నడూ లేవు. సర్కారు కూడా బదిలీ చేసేప్పుడు వివరణ తీసుకోదు. కేవలం క్రమశిక్షణ చర్యలు తీసుకునేటప్పుడు మాత్రమే సంజాయిషీ తీసుకునే ఆనవాయితీ ఉంది. ఇంటెలిజెన్స్‌ అనేది ఎలా చూసినా పోలీసింగ్‌లో భాగమే. చంద్రబాబుకు అనుకూలంగా ఈసీ నిర్ణయాలు లేకపోతే ఏకపక్షమని, ఆయనకు అనుకూలంగా ఉంటే అద్భుతమని అనుకోవడం సరికాదు.        
– ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ సీఎస్‌  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top