ఎంపీపీపై అవిశ్వాస ప్రతిపాదన

Antitrust Conclusion Notice On The MPP - Sakshi

తాండూరు రూరల్‌ : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి సొంత ఇలాఖాలో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. తాండూరు ఎంపీపీ లక్ష్మమ్మపై సొంత పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. 9 మంది టీఆర్‌ఎస్, ఆరుగురు ఎంపీటీసీలు కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు.

అప్పట్లో అంతారం–2 ఎంపీటీసీ సభ్యురాలు కోస్గి లక్ష్మమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాట కారణంగా మంగళవారం అదే పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ లక్ష్మమ్మపై తిరుగుబాటు జెండా ఎగురువేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యులతో కలిసి మంగళవారం తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌ను కలిసి అవిశ్వాసం లేఖ అందజేశారు.  

వడ్డె శ్రీనుతో వేగలేకపోతున్నాం.. 

టీఆర్‌ఎస్‌కు చెందిన అసమ్మతి ఎంపీటీసీ సభ్యులు శేఖర్, వసంత్‌కుమార్, శోభ మాట్లాడుతూ.. ఎంపీపీ లక్ష్మమ్మ వర్గీయుడు, తాండూరు మండలంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వడ్డె శ్రీను మండలంలో ఏకపక్షంగా, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీపీ వ్యవహారాల్లో అతనే ముందుండి నడిపిస్తున్నారని, తమను లెక్క చేయడం లేదని మండిపడ్డారు.

ఆయనతోనే స్థానికంగా టీఆర్‌ఎస్‌ భ్రష్ఠుపట్టిందని, గ్రామాల్లో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. తమకు మంత్రి మహేందర్‌రెడ్డి అంటే అభిమానమేనని.. కానీ వడ్డె శ్రీను ఒంటెత్తు పొకడతో ఎంపీపీపై అవిశ్వాసం పెట్టాల్సి వస్తోందని తెలిపారు.   

మంత్రి రంగంలోకి దిగినా ఫలితం శూన్యం..   

తాండూరు మండలం ఎంపీపీ కోస్గి లక్ష్మమ్మపై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యులు సిద్ధమయ్యారనే విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి అప్రమత్తయ్యారు. సోమవారం మధ్యాహ్నం వైస్‌ ఎంపీపీ శేఖర్‌తోపాటు ఎంపీటీసీ సభ్యులు వసంత్‌కుమార్, మ్యాతరి శోభతో ఫోన్‌లో మాట్లాడారు. అంతర్గత సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుందామని.. ఇలా రచ్చకెక్కడంతో  పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సర్దిచెప్పారు.

మంత్రి మాటలు లెక్కచేయకుండా అసమ్మతి ఎంపీటీసీలు మంగళవారం ఆర్డీఓను కలిసి ఎంపీపీపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు లేఖ ఇచ్చారు. దీంతో మంత్రి మహేందర్‌రెడ్డి అసమ్మతి ఎంపీటీసీలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top