‘మీకు ధనబలం ఉంటే వైఎస్‌ జగన్‌కు జనబలం ఉంది’

Anam Ramanarayana Reddy Fires On Chandrababu Over TDP Fake Survey - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆనం రాంనారాయణరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధనబలం ఉంటే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి జనబలం ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంల మీద సాకులు చెప్పడానికి టీడీపీ ఇప్పుడే ప్రచారాన్ని ప్రారంభించిందని విమర్శించారు. నంద్యాల ఉపఎన్నికలో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన టీడీపీ.. ఇప్పుడు కత్తిరింపు సర్వేతో దగా చేయడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్‌ నేతృత్వంలో తెలుగు యువత పేరుతో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే కార్యక్రమానికి తెరతీశారని మండిపడ్డారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 10 వేలు, 20 వేల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ట్యాబ్స్‌లో ఓటర్ల లిస్ట్‌ పెట్టుకుని సర్వేలు చేయడమేమిటని.. అసలు ట్యాబ్‌లకు, ఆర్టీజీఎస్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వీటిని టీడీపీ కార్యాలయానికి లింక్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని, చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి తమ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఫిర్యాదు చేశారని తెలిపారు.

బాబుకు ఎందుకో అంత భయం!
ఐటీ, సీబీఐ అంటే సీఎం చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారు..  అసలు ఆయన బాధ ఏంటో అర్థం కావడం లేదని ఆనం ఎద్దేవా చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని మండిపడ్డారు. చంద్రబాబుకు నిజంగా నిజాయితీ ఉంటే తన పాలన మీద రెఫరెండం పెట్టమని అని చెప్పగలరా అని ప్రశ్నించారు. 40 సంవత్సరాల అనుభవంతో కొత్త హామీలు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ము ఉందా అంటే.. అది కూడా చెప్పలేని స్థాయికి దిగజారి పోయారని విమర్శించారు. ధనబలంతో రాష్ట్ర ప్రజలని వంచించే ప్రయత్నం చేస్తూ... డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చెక్కుల పంపిణీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం అంటే కాపీ మినిస్టర్‌
తమ పార్టీ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతూ... సీఎం అంటే కాపీ మినిస్టర్‌గా మారారని ఆనం ఎద్దేవా చేశారు. టీడీపీ వేసేది మ్యానిఫెస్టో కమిటీ కాదు.. మ్యానిపులేషన్‌ కమిటీ అని అన్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని.. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ విచారణ అంటే బాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ కుట్రలో లోకేష్ పాత్ర లేకపోతే... డీజీపీతో లోపాయకారి ఒప్పదం చేసుకోకపోతే ఎన్‌ఐఏను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top