ఉద్ధవ్‌పై అమృత సంచలన వ్యాఖ్యలు..

Amruta Fadnavis Says Having Bad Leader Not Maharashtra Fault - Sakshi

ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృత ఫడ్నవీస్‌ కొద్ది రోజులుగా అధికార శివసేనపై సోషల్‌ మీడియాలో మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్న శివసేన.. ఆ సంస్థ ఉద్యోగులకు జీతాలకు సంబంధించిన బ్యాంక్‌ ఖాతాలను యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి వేరే జాతీయ బ్యాంక్‌కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే యాక్సిస్‌లో సీనియర్‌ అధికారిణిగా ఉన్న అమృత.. శివసేన నిర్ణయంపై ట్విటర్‌ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు.

తాజాగా ఉద్ధవ్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒక చెడ్డ నాయకుడిని కలిగి ఉండటం మహారాష్ట్ర తప్పు కాదు. అయితే ఆ నాయకుడికి మద్దతు ఇవ్వడం తప్పు’ అంటూ అమృత ట్వీట్‌ చేశారు. జాగో మహారాష్ట్ర అని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తాను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా పోస్ట్‌ చేశారు. ‘నేను  దేవేంద్ర ఫడ్నవీస్‌ను పెళ్లి చేసుకోక ముందు నుంచే పుణె మున్సిపల్‌ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు యాక్సిస్‌ బ్యాంక్‌లో కొనసాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌, ఎన్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అవి అలాగే ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకులు కూడా భారత్‌కు చెందినవే. అవి ఉన్నతమైన సాంకేతికతో కూడిన సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం హేతుబద్ధంగా ఆలోచించాలి. ఇలా చేయడం ద్వారా వారు నా భర్తను, నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. దేవేంద్ర ఎప్పుడూ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోని పనిచేయలేదు. శివసేన చేస్తున్నది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం. మేము దీనిపై మౌనంగా ఉండదలచుకోలేదు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా ప్రజలకు హాని చేసేలా ఉందని భావిస్తే.. వాటిపై పోరాటం కొనసాగిస్తాను’ అని తెలిపారు.

గతంలో కూడా అమృత.. పేరు చివర ఠాక్రే అని పెట్టుకున్నంతా మాత్రాన ప్రతి ఒక్కరు ఠాక్రేలు అయిపోరు అంటూ ఉద్ధవ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమృత వ్యాఖ్యలపై శివసేన నేతలు మండిపడుతున్నారు. ఆమెకు కౌంటర్‌గా కామెంట్లు పెడుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top