వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

AmBati Rambabu Slams Cm Chandrababu Naidu Over Kapu Reservations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాపు రిజర్వేషన్లపై ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం పార్టీ కేంద్రం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా లబ్ది పొందాలని కొన్ని శక్తులు కుట్ర పన్నాయన్నారు. కాపు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవని మాత్రమే తమ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పారని, కాపురిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ హామీ ఇస్తే వెనక్కి తీసుకునే ప్రసక్తిలేదని, కాపు రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తునే ఉంటామన్నారు.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు బాధాకరమని, కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. 6 నెలల్లో బీసీ కమిషన్‌ వేసి కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారని, మరి ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ఈ రోజు వరకు కాపు రిజర్వేషన్ల అంశం ఎందుకు పెండింగ్‌లో ఉందన్నారు. ముద్రగడ ఉద్యమం తర్వాతే చంద్రబాబుకు కాపులు గుర్తొచ్చారని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై బీసీ కమిషన్‌ వేసి రిపోర్ట్‌ను పరిశీలంచకుండా హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. కాపురిజర్వేషన్లపై బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నివేదిక ఇవ్వలేదని, విడివిడిగా నివేదికలు ఇచ్చే అధికారం ఎవ్వరికి లేదని ఛైర్మనే చెప్పారని అంబటి గుర్తుచేశారు.

ఈ అంశంపై కేవలం ముగ్గురు సభ్యులు ఇచ్చిన రిపోర్టునే కేంద్రానికి పంపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న నిధులనే కాపులకు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. ముద్రగడ ఆమరణ దీక్షకు దిగితే తలుపులు పగలగొట్టి ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు కొట్టుకుంటు లాక్కెళ్లారని, ఆ సమయంలో ఆయనకు అండగా నిలబడిన వ్యక్తి వైఎస్‌ జగనే అని గుర్తుచేశారు.  తుని ఘటనలో ముద్రగడ, బొత్స సత్యనారయణ, భూమన కరుణాకర్‌ రెడ్డి, తనపై కేసులు పెట్టారని, కాపు రిజర్వేషన్ల కోసం దివంగత నేత దాసరి నారాయణ రావు నేతృత్వంలో తమంతా పోరాడామన్నారు. కాపు ఉద్యమానికి అండగా ఉన్న పార్టీ వైఎస్సార్‌సీపీనే అని, ఈ అంశం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top