
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్న కాంగ్రెస్, షెడ్యూల్‌కు ముందే అగ్ర నాయకత్వాన్నంతా రాష్ట్రంలో పర్యటించేలా ప్రణాళిక వేస్తోంది. దీనిలో భాగంగా ఇకపై ప్రతివారం ఒక జాతీయ స్థాయి నేతను హైదరాబాద్ పంపాలని యోచిస్తోంది. తెలంగాణ ఏర్పాటు దశలో కీలకంగా వ్యవహరించిన ఏఐసీసీ నేతలందరినీ ప్రచారంలోకి దించి కాంగ్రెస్ గెలుపు అవకాశాలను సులభం చేసే దిశగా వ్యూహాలు రచిస్తోంది. వారందరినీ ప్రచార సమరంలోకి దింపితే పార్టీకి బహుళ ప్రయోజనం ఉంటుందన్న నేపథ్యంలోనే జాతీయ స్థాయి నేతలందరినీ తెలంగాణ పర్యటనకు పంపి వారితో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
ఇప్పటికే రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ రాష్ట్రంలో రెండ్రోజులపాటు పర్యటించి కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. ఏఐసీసీ లీగల్ సెల్ చైర్మన్ వివేక్ థంకా సైతం కొద్దిరోజుల కిందటే వచ్చి ఓటర్ల జాబితాలో తప్పులపై కేసులు వేసే దిశగా సూచనలు చేశారు. ఈ వారం రోజుల్లో ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయి. ఇక సామాజిక వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని షిండే, మీరాకుమార్‌లను ఎస్సీ నియోజకవర్గాల్లో పర్యటింప చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.
ఇక తెలంగాణ బిల్లు సమయంలో పొందుపరిచిన అనేక అంశాల్లో కీలకంగా ఉన్న జైరాం రమేశ్, నారాయణస్వామిలను ముందుపెట్టి, హైకోర్టు విభజన, ముంపు మండలాల విలీనం అంశాల్లో టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌తో తెలంగాణ సాధ్యం కాలేదన్న అంశాన్ని బలంగా చెప్పించేందుకు కమల్‌నాథ్, వీరప్ప మొయిలీవంటి నేతలను రంగంలోకి దించుతున్నారు.
ఇక పార్లమెంట్ సాక్షిగా అనేక అంశాల్లో బీజేపీతో టీఆర్‌ఎస్ అంటకాగుతోందన్న అంశాలను లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేతో ప్రచారం చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే వీలైనంత ఎక్కువ మంది ఏఐసీసీ నేతలను రాష్ట్ర పర్యటనకు పంపి, అటు టీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు, ఇటు పార్టీకి బూస్టింగ్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.