బీసీలకు 65 శాతం టికెట్లు | Sakshi
Sakshi News home page

బీసీలకు 65 శాతం టికెట్లు

Published Wed, Aug 29 2018 12:55 AM

65% Tickets for BCs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 65 శాతం అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటిపార్టీసహా 22 బీసీ సంఘాలు, 64 బీసీ కుల సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో మంగళవా రం అఖిల పక్షాలు, బీసీ సంఘాల సమావేశంలో ఎల్‌.రమణ(టీడీపీ), చాడ వెంకటరెడ్డి(సీపీఐ), దిలీప్‌కుమార్‌(టీజేఎస్‌), ఆర్‌.కృష్ణయ్య(ఎమ్మెల్యే), చెరుకు సుధాకర్‌ (తెలంగాణ ఇంటిపార్టీ), రాజేందర్‌ (ఎంఐఎం) ప్రసంగించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో బీసీలకు 65శాతం టికెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ భరతం పడతామని హెచ్చరించారు. బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రతీ నియోజకవర్గంలో 60 నుంచి 70 శాతం బీసీ జనాభా ఉందని, బీసీలకు టికెట్లు ఇస్తే వారే గెలుపుగుర్రాలని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇప్పటికే బీసీ బిల్లుకు మద్దతుగా ప్రధానమంత్రికి లేఖ రాశామన్నారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ తమ పార్టీ ఇప్పటికే బీసీలకు 50 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించినట్టుగా గుర్తుచేశారు.

బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో బీసీలకు కేటాయించిన బడ్జెట్‌లో 50 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలకు అన్యా యం చేస్తున్నాయని, ఇది సరైన విధానం కాదని విమర్శించారు. టీజేఎస్‌ నేత దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ పార్టీ పదవుల్లో తమ పార్టీ ఇప్పటికే బీసీలకు 50శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, గొరిగే మల్లేశ్, నీల వెంకటేశ్, రమ్య, వేముల రామకృష్ణ, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement