రాష్ట్రంలో 52 లక్షల నకిలీ ఓట్లు | 52 lakh fake votes in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 52 లక్షల నకిలీ ఓట్లు

Dec 22 2018 4:45 AM | Updated on Dec 22 2018 4:45 AM

52 lakh fake votes in the state - Sakshi

ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియాకు వినతిపత్రమిస్తున్న ఉమ్మారెడ్డి, కాసు మహేష్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 52 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, ఒక్క నరసరావుపేట నియోజకవర్గంలోనే 43 వేల డూప్లికేట్‌ ఓట్లున్నాయని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ గురజాల సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాత్కాలిక సచివాలయంలోని ఎన్నికల ప్రధాన అధికారి ఆర్‌పీ సిసోడియాను కలిసి గురజాల నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దొంగ ఓట్లు చేర్పించడంలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుది అందెవేసిన చేయి అని ఆరోపించారు. గురజాలలో డూప్లికేట్‌ ఓటర్ల పూర్తి వివరాలు తెలియజేస్తూ ఆన్‌లైన్‌ ద్వారా ఫారం నంబర్‌ 7లో ఆర్డీవోకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఆర్డీవో పట్టించుకోలేదన్నారు.

యరపతినేని ఒత్తిళ్లు తట్టుకోలేక మాచవరం తహసీల్దార్‌ సెలవులో వెళ్లిపోయినట్లు తెలిపారు. ఫిర్యాదు చూసిన తరువాత పరిశీలించి వారు కూడా అన్యాయం అంటున్నారని, కానీ చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారన్నారు. అధికారం ఉన్నవాడి చేతుల్లో విచ్చలవిడితనం మంచిది కాదన్నారు. గురజాల నియోజకవర్గంలో 13 వేల దొంగ, నకిలీ ఓట్లున్నట్లు గుర్తించామన్నారు. సెప్టెంబర్‌ 30లోపే ఆర్డీవోకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీటన్నింటి వివరాలు ఈసీకి ఆధారాలతో సహా అందజేశామన్నారు. 2004లో వైఎస్సార్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 96 లక్షల దొంగ ఓట్లున్నాయని ప్రతిపక్షం ఫిర్యాదు చేస్తే ఈసీ స్పందించి తొలగించిందని గుర్తు చేశారు. నకిలీ ఓట్లపై చర్యలు తీసుకోకుంటే హైకోర్టుకు వెళ్తామన్నారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, రూరల్‌ మండలాల్లోనే 8 వేల దొంగ ఓట్లున్నాయని వీటన్నింటినీ తొలగించాలని కోరినట్లు తెలిపారు.

చర్యలు తీసుకుంటాం
ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసినందున తప్పకుండా విచారించి చర్యలు తీసుకుంటామని ఈసీ సిసోడియా వైఎస్సార్‌సీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్‌రెడ్డిలకు హామీ ఇచ్చారు. ఫిర్యాదును స్వీకరించిన ఈసీ హార్డ్‌కాపీలు కూడా తీసుకున్నారు. డూప్లికేట్, దొంగ ఓట్లను తొలగిస్తామని హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement