మరుగున పడ్డ ఎస్‌వి రంగారావు కథ

మరుగున పడ్డ ఎస్‌వి రంగారావు కథ




అవును. ఆ ఎస్‌వి రంగారావు గారే. ముళ్లపూడి చేత చతురంగా, క్రూరంగా, భయంకరంగా, విలాసంగా అనే విశేషణాలతో కొనియాడబడ్డ ప్రముఖ నటులు ఎస్.వి.రంగారావు. అయితే ముళ్లపూడి ఈయన సాహిత్యాభిలాషని కూడా గమనించినట్టయితే ఇంకో పన్ అదనంగా పన్నేవారు.



ఎస్‌వి రంగారావు కథలు రాస్తారు అని ఎవరూ ఎక్కడా అనుకోవడం వినలేదు. హటాత్తుగా ఈ కథ కనిపించగానే ఆశ్చర్యం వేసింది. చదివాక ఇంకా ఆశ్చర్యం వేసింది. ఈ కథనంలో స్పష్టతకీ, కథలో పోషించిన ఉత్కంఠకీ, భావవ్యక్తీకరణలో నవ్యతకీ. జనవరి 13, 1960 ఆంధ్రపత్రికలో వచ్చిన ఈ ‘వేట’ని కథ అనుకున్నవాళ్లు ఉన్నారు. వ్యాసం అనుకున్నవాళ్లూ ఉన్నారు. ఎవరు ఎలా అనుకున్నా అందరూ మెచ్చుకోవడం అనేది జరిగిపోయింది. బహుశా బిజీగా ఉండే ఒక నటుడి నుంచి ఇలాంటి సాహిత్యపు తునక ఎవరూ ఊహించి ఉండరేమో.



 ఇక కథలోకి వస్తే- కథకుడు ఒక ఔత్సాహిక వేటగాడు (రంగారావుగారే). మిత్రులతో పులిని వేటాడ్డానికి అడ్డతీగల అడవుల్లోకి జీపులో ఓ చీకటి రాత్రి ప్రయాణం. ప్రారంభంలోనే చీకటి గురించి, అడవి గురించి ఓ మూడు పేరాల వర్ణన ఉంటుంది. సాధారణంగా ఇలా వర్ణనలతో ప్రారంభమయ్యే కథలు తరువాత చదువుదాం అనిపించేలా ఉంటాయి కాని ఆ చీకటి వర్ణనల్లో ఉన్న భాష తాలూకు మెరుపులో వాటిని చదివించేలా చేస్తాయి. చీకటి పిరికివాడి భయంలా చిక్కగా ఉందట. కడుపులో ప్రమాదాలు దాచి పెట్టుకున్న చీకటి మిణుగురులతో ఇకిలిస్తోందిట. ఆర్కెస్ట్రాలో అసందర్భపు క్లారినెట్‌లా ఎక్కడో నక్కలు అపశ్రుతిగా అరుస్తున్నాయిట. అలా ఆ ఆటవిక నిశ్శబ్దంలో ప్రయాణిస్తూ ఉండగా వెనక మిత్రుడు ఓ పొడిదగ్గు దగ్గుతాడు.



 ఊ అన్నాను వెనక్కి తిరక్కుండానే.అబ్బే అన్నాడు అతడు. చలా? ఊహూ

 భయమెందుకోయ్ అన్నాను భయం అణచుకుంటూ.

 అతను నవ్వాడు- ధైర్యం తెచ్చుకుంటూ.

 నాది భయమా? భయమైతే నేనెందుకు షికారుకు వెళ్లాలి? ధైర్యముంటే అతనెందుకు భయపడాలి? అయినా పులి ఎదురు పడితే ఏమవుతుంది? ట్రిగ్గర్ నొక్కుతాం. ఆ పులికీ, ఈ ట్రిగ్గర్‌కీ భేటీ కుదరకపోతే? అరక్షణం తర్వాత ఏం జరుగుతుంది? నరాలను మెలిపెట్టే ఆలోచన ఆ క్షణం గురించి. అదే భయం- అదే సుఖం- ఆ క్షణమే స్వర్గం- ఆ క్షణమే భరించరాని నరకం. అదే అంతవరకూ వేటగాడు ఎదురుచూసిన ముహూర్తం.... అని వేటగాడి మనోద్రేకాలని నాలుగు ముక్కల్లో సంక్షిప్తీకరిస్తాడు కథకుడు.



 ఇంతలో మిత్రుడు సడన్ బ్రేక్ వేస్తాడు. జీప్ హెడ్‌లైట్ కిరణాల చివరి అంచున మసగ్గా ఓ జంతువు కదలిక. కథకుడు ఆలస్యం చేయడు. ఉత్సాహం కొద్దీ గబుక్కున గురి పెట్టి తుపాకీ ట్రిగ్గర్ నొక్కేస్తాడు. ఓ క్షణం నిశ్శబ్దం. అంతలో పెద్ద గర్జన. మిత్రులందరూ వద్దని వారిస్తున్నా వినకుండా జీపు దిగి ఆ జంతువు కనిపించిన చోటికి తుపాకీ పొజిషన్‌లో పట్టుకొని నెమ్మదిగా నడవడం ప్రారంభిస్తాడు. పులి చచ్చిందో లేదో తెలీదు. మిత్రులు బ్యాటరీ లైట్‌తో చూపించిన వెలుగు వైపు చూస్తే ఎదురుగా ఓ ఇరవై అడుగుల దూరంలో దెబ్బ తిన్న చిరుతపులి కాచుకుని ఉంది. గుండె ఝల్లుమంది. ఉన్నది ఒకే ఒక గుండు. చావూ బతుకూ పక్కపక్కనే నిలిచిన క్షణం. వెంటనే బాటరీ లైట్ ఆ పులి కళ్ల మీదకి వేసి అది తేరుకునే లోపల గురిపెట్టి కాల్చేస్తాడు. ఇప్పుడు గర్జన లేదు. చిన్న మూలుగు. అంతే.

 విజయం. అభినందనలు. దుస్సాహసం చేసినందుకు ప్రేమతో నిండిన మందలింపులు.



 చంపిన చిరుతను వేసుకొని జీపు గ్రామం వైపు బయల్దేరింది. ఇప్పుడు కథకుడి అంతరంగంలో ఏవో ఆలోచనల అలజడి. ఏమిటా ఆలోచనలు? పులికి తనతో శత్రుత్వం లేదు. దాని మానాన అది అడవిలో ఉంది. తనే పులికి శత్రువు. తను నాగరికుడు కాబట్టి. తనకు తెలిసిన వంచనా శిల్పం పులికి తెలియదు. అందుకే తనకి ధైర్యం. అదే అక్కడ పులి కాకుండా తుపాకీతో నిల్చున్న ఒక మనిషిని ఎదుర్కోవాల్సి వస్తే. అప్పుడు ఇంతే ధైర్యం ఉంటుందా? పులిని చంపడం ప్రతీకారమా లేదా తనలోని అహంకారానికి ఉపశమనమా?

 కథ ముగింపుకు వచ్చేస్తోంది.



 వాట్ రంగారావు- ఏమిటలా ఉన్నావు? అంటున్నారెవరో.

 కొత్తగదయ్యా పోను పోను అతనే సర్దుకుంటాడు అంటున్నారింకెవరో.

 జీపు ఊరి వేపు నాగరికత వేపు సంస్కారం వేపు ముందుకు సాగిపోతోంది.

 అని కథ ముగిస్తారు రంగారావు



చూట్టానికి ఇది మామూలు వేట కథలాగానే ఉన్నా పులిని చంపాక అతడి హృదయంలో కలిగిన అలజడి పాఠకుడిలో కూడా కలగడంలోనే దీని గొప్పతనం ఉంది. పులిని చూసి కాదు భయపడాల్సింది మనిషిని చూశా? నాగరికత అంటే ఏమిటి? ఆటవికం కంటే ఇంకా ఆటవికంగా ఉండటమా?



 ఎస్ వి రంగారావు పేరిట మరో అయిదు కథలు పాత పత్రికల్లో కనిపిస్తున్నా అవి ఆయన రాసినవేనా అని నిర్థారించుకోవాల్సి ఉంది. వచ్చే నెల- 3న ఆయన జయంతి. 18న ఆయన వర్థంతి. ఈ లోపల తెలుసుకోగలిగితే బాగుణ్ణు.

 - ఎ.వి.రమణమూర్తి 98660 22150

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top