
పనయ్యాక నాన్న ఇల్లు చేరుకుంటాడు. ఆ రోజంతటినీ ముగించి, ఆ రోజును అంతటితో చాలించి. ఉదయం వెళ్లేప్పుడు బయటకు చెప్పని హామీ ఇచ్చి వెళతాడు– సాయంత్రానికి ఇల్లు చేరుకుంటానని. మరి ఏం జరిగినా సరే... తుఫాను గొంతు చించుకున్నా సరే... భూమి నిట్ట నిలువునా చీలినా సరే... నాన్న... ఇల్లు చేరుకుంటాడు.
చీకటి పడితుంది... రాత్రి ఎనిమిదైపోతుంది... తొమ్మిదీ పదీ కూడా కావచ్చు... గ్రీజు మరకలు, ఆయిల్ వాసనా, గడ్డినూగు నస, చాక్‌పీస్‌పొడి రాలిన తల, గుండెన గుచ్చుకు వేళ్లాడుతున్న చీవాట్లు, ఆవేళ్టికి సరిపడా అవమానాలు, ఓవర్ డ్యూటీ ముఖము, కూచుని కూచుని పడి΄ోయిన నడుము... సరి చేసుకుని, సవరించుకుని... నాన్న... ఇల్లు చేరుకుంటాడు.
కొన్ని ద్రాక్షపళ్లు తెద్దామనుకుంటాడు. కాసింత మిఠాయి తీసుకెళ్లకుంటే ఎలా అనుకుంటాడు. అరటిపండ్లకూ ఇంటి సభ్యులకైతే జత సరిగ్గా కుదురుతుంది. మరునాడు పిల్లలు పెన్సిల్ కొనేందుకు చేయిపెడితే చిల్లర వరకైనా తగిలేలా జేబును భద్రం చేసుకుంటేగాని కదలడు. ఖాళీ జేబును భార్య అర్థం చేసుకుంటుంది. పిల్లలకు నాన్న జేబు ఎప్పుడూ హుండీయే.
నాన్న ఇల్లు చేరుకుంటాడు. దారిలో స్కూటర్ కుర్రాడు టక్కర్ ఇస్తే పడి, లేచి, ఎవరో ఇచ్చిన నీరు తాగి, మరేం పర్లేదని– నేరుగా ఇల్లు చేరుకుంటాడు. ఆ సంగతి ఎప్పటికీ ఇంట్లో చెప్పడు. పాత బాకీవాడు కూసిన నానా కూతలూ చెప్పడు. దగ్గరి బంధువొకరు గతిలేక గోజాడితే ఆ కాసింత సర్దుబాటు చేయలేనందుకు మనసున మూగెండ పట్టిందని ఎవరితోనైనా చెప్పగలడా ఏమి?
పని ఉంటేనే నాన్న సెలవు పెడతాడు. పని లేకున్నా పెట్టొచ్చని అంటే భయపడిపోతాడు. నాన్న ఇంటికి యజమానో... పాలేరో. నాన్నను ఆ రోజంతా నాన్న మనుషులు ఏమేమి అన్నారో ఎన్నెన్ని అనుకున్నారో... నాన్నకు చుట్టూ ఉన్న జనం ఏమేమి పేర్లు పెట్టారో... ఎన్నెన్ని బిరుదులిచ్చారో... మంచివారి మంచి వల్ల బతుకుతున్నాడో... చెడ్డవారి చెడ్డను ఎదుర్కొనేందుకు ఊపిరి తిరగేస్తున్నాడో...
ఇంటికొచ్చి నాలుగు మెతుకులు తిని నడుం వాల్చిన నాన్నను చూస్తే ఉదయం లేవడానికి పడుకున్నట్టు సాయంత్రం ఇల్లు చేరడానికి పడుకోనివ్వండన్నట్టు ఉంటాడు. నాన్న యుగాలుగా ఇల్లు చేరుకుంటున్నాడు. యుగాల పాటు ఇలాగే ఇల్లు చేరుకుంటాడు. ఆ రోజుకి కాసింత నవ్వాడో లేదో– ఇంటికొచ్చాక నవ్వేలా ఉంచగలమో లేదో– మొత్తానికి నాన్న ఇల్లైతే చేరుకున్నాడు.
– ఖదీర్
(చదవండి: యువరాజ్ సింగ్ లగ్జరీ ఇల్లు.. అసలైన ఇంటీరియర్ డిజైన్ అదే అంటున్న యువీ!)