దుశ్శాసనుడు దొరుకుతాడా
దుశ్శాసనుడు దొరుకుతాడా
ఎన్ని దారుల్ని వడపోసినా
మరెన్ని నేలల్ని పొరలు పొరలుగా విప్పి విదిలించినా
ఒలి ఒలినీ నువ్వు గాలించినా
పేళ్ళు పేళ్ళుగా నరికి చరిత్రను వెతికినా
సర్రున ఎగిరి ఏ గువ్వా రాదు.
పుస్తకం తన పేజీల్ని తాను చదవదు.
బియ్యంలో రాళ్ళేరినట్టు అక్షరాల పుచ్చుల్ని ఏరదు.
మిన్ను విరిగి మీద పడినా
కన్ను వెనక్కి తిరిగి కనుపాపలోకి నడవదు.
చూపునూ వాపునూ తాకదు.
నదులయినా కాలవలయినా
పాలిపోయిన చర్మం లోతుల్నుంచి పొడుచుకొచ్చే
పుళ్ళను కడుక్కోవు.
తుప్పు పట్టిన తాళం భళ్ళున తెరుచుకోదు.
ఇప్పుడు చెప్పు
నీలోనే పదిలంగా నిదురించే
దుశ్శాసనుడు ఎప్పటికయినా పట్టుబడతాడా.
రాముడికి పడవకట్టే గుహుడు
రావణుడి కవాతులో కాలు కలుపుతాడా.
ఎక్కడయినా చీకటిని చీకటే తగలబెడుతుందా.
నీ కొమ్మల్ని కుంగదీసిన బూజుమబ్బుల్ని
ఎవరు దులపాలి.
నీ కెరటాల్ని కత్తిరించే చేతుల్ని
ఎట్లా పసిగట్టాలి.
కొండకివతలే మడుగులో కూరుకుపోయిన నిన్ను
బయటికెవరు లాగాలి.
జి.లక్ష్మీనరసయ్య
9246572073
నిద్రబోయిన కల!
నిర్దేశించిన రంగులతో ప్రపంచాన్ని గీస్తామో
రంగులు తీసిన ప్రపంచాన్నే చూస్తామో
వాస్తవానికి ఓ ఇష్టపూర్వకమైన
ఆహ్వానాన్ని పలుకుతాము
ఖాళీ అయిన గుండెకి
ఘనపరిమాణం పెరిగినట్లుంది
ఆకళింపూ, అవలోకనాలలో
ఆరితేరినతనాన్ని
ఘటనలన్నీ నిరూపిస్తాయి
ఏ విశేషమూ జరగని
నిన్నటి ఒకరోజు
అద్భుతమై ఆశ్చర్యంగా
తృప్తిని మిగులుస్తుంది
మూసుకున్న కళ్లు తెరవబడి
ఓ స్వప్నం మాత్రం నిదురబోతోంది
మెలకువలో జీవించడం
ఎంత బాగుంటుంది!?
అస్పరాగస్ అందమూ కాదు
కుదురుగా ఒదిగిన కార్నేషన్ మిస్ట్
అలంకారమూ కాదు
గుచ్ఛమై జీవితానికి
బహూకరించిన విధం బాగుంటుంది
రాళ్ళబండి శశిశ్రీ
7032288256
కితాబు
చేనుని తీసుకొచ్చి
కాగితమ్మీద పెట్టాను అక్షరాలుగా
మొక్కల్ని భగ్నపరచకుండా-
ఎవరో ఒకతను ఎక్కడో ఆ అక్షరాల్ని దర్శించి
నన్ను మాటల పెట్టెలోంచి అడిగాడు
‘‘మీరు రైతులా?’’ అని-
ఆ ప్రశ్నను మించిన ప్రశంస ఇంకేముంటుందని-
మట్టికి దండం పెడుతూ
నేను చేనులా బదులిచ్చాను
దర్భశయనం శ్రీనివాసాచార్య
9440419039