ఊహాశక్తికి పుస్తకమే మార్గం

ఊహాశక్తికి పుస్తకమే మార్గం


పఠనానుభవం

 

కాలేజీ రోజుల్లో హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఓ వెయ్యి పేజీల పుస్తకం చదవడం కన్నా ఒక సినిమా చూడటం సులువు అనే ఆలోచ నతో సినిమాలు విపరీతంగా చూశాను. అప్పుడు పుస్తకాల విలువ నాకు తెలియదు.నేను దర్శకుడి నయ్యాక స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు పుస్తకాల గొప్పతనం అర్థమయింది. సినిమాలో ఓ సన్నివేశం చూసేటప్పుడు మన ఊహాశక్తికి పని ఉండదు. ఎవరో ఊహించి అక్కడ  సన్నివేశం రాస్తారు. ఇక సినిమా చూసే ప్రేక్షకులు ఇంకేం ఊహించుకుంటారు! సన్నివేశంలో ఇక్కడ ఇల్లు ఉంటుంది, పిల్లి ఉంటుంది అని వాళ్లే చెప్పేస్తారు. అంతకు మించి ఊహించుకోవడానికి ఏమీ ఉండదు. కానీ పుస్తకం చదివేటప్పుడు ఇమేజినేషన్ పాళ్లు ఎక్కువ. పది మంది ఓ పుస్తకం చదివితే దానిని పదిరకాలుగా ఆలోచిస్తారు.   నేను మొట్టమొదటిసారి చదివిన ఇంగ్లీషు పుస్తకం మార్క్ ట్వేన్ ‘ది ఎడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’. చదివిన తర్వాత మా ఫ్రెండ్స్‌కు దాన్ని యథాతథంగా అప్పజెప్పా. నేను ఇంటర్మీడియట్‌లో ఉండగా ఓ అమెరికన్ దంపతులు తమ లైబ్రెరీ నుంచి వాళ్ల పుస్తకాలు ఇచ్చారు. అలా మార్క్ ట్వేన్ రచనలన్నీ చదివేశా. అలాగే, రాబర్ట్ లూయీ  స్టీవెన్‌సన్ నవలలు కూడా నన్ను బాగా ఆకర్షించాయి.పెరల్ ఎస్ బక్ ‘ద గుడ్ ఎర్త్’ నాకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి. అందులో సంభాషణలు సహజంగా ఉంటాయి. నా అదృష్టం ఏంటంటే  నవల చదివాక దాని ఆధారంగా వచ్చిన సినిమా చూశా. చైనా వాళ్ల జీవిత విధానం ఎలా ఉంటుందో ఈ నవల కళ్లకు కట్టినట్లు చూపించింది.  హెమింగ్వే ‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ’ చాలా ఇష్టం. సముద్రంలోని మార్లిన్ అనే చేపకూ, ఓ జాలరికీ మధ్య జరిగే సంఘర్షణ ఈ నవల ఇతివృత్తం. ఎలిజబెత్ బోవన్ అనే నవలా రచయిత దీని గురించి మాట్లాడుతూ-‘ నాట్ ఎ వర్డ్ కెన్ బి రీప్లేస్‌డ్’ అని వ్యాఖ్యానించారు. ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో  సినిమా తీశారు. కానీ నాకు ఆ సినిమా నచ్చలేదు. నవల చదువుతున్నప్పుడు కలిగిన అనుభూతి సినిమా చూస్తున్నప్పుడు కలగలేదు.

ఆ తర్వాత - నాకు నాటకాలంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో జార్జ్ బెర్నార్డ్ షా నాటకాలంటే ఎగబడేవాళ్లం. ఆయన ‘పిగ్‌మాలియన్’ బాగా నచ్చింది. ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘షి స్టూప్స్ టు కాన్‌క్వర్’ నాటకం కూడా బాగా నచ్చింది.తెలుగు విషయాని కొస్తే, కాళీపట్నం రామారావు, పాలగుమ్మి పద్మరాజు,  కొడవటిగంటి కుటుంబరావు రచనలు చాలా ఇష్టం. ముళ్లపూడి వెంకటరమణ రచనలు చాలా ప్రేరణ కలిగించాయి. ఇక, విశ్వనాథ సత్యనారాయణ ‘మా బాబు’ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను పెరిగి పెద్దయ్యేవరకూ కూడా ఆ కథలోని పాత్రలు, సన్నివేశాలు నా మనస్సులో అలా ముద్ర పడిపోయాయి. ఇప్పటికీ మరోసారి దాన్ని చదవాలనిపిస్తుంది.

 

- సింగీతం శ్రీనివాసరావు

  దర్శకుడు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top