వామనుడేగానీ ఆజానుబాహుడు

వామనుడేగానీ ఆజానుబాహుడు


సందర్భం

ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినప్పుడు ‘బంగారం తాకట్టు’ విధానాన్ని అమలు చేయడంలో వైవీరెడ్డి పాత్ర గొప్పది. అది ఒక విధంగా అగ్నిపరీక్షే. ఇక 2008 నాటి అమెరికా ఆర్థిక సంక్షోభ కాలంలో ఆయన భారత్‌ను అమోఘంగా నిలబెట్టారు.వారి జీవిత చరిత్ర చదివాను. మట్టిలో నుంచి మాణిక్యాలు పుట్టినట్లు కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో మారుమూల కుగ్రామంలో పుట్టి, అంతర్జాతీయ స్థాయికి ఎదగగలిగిన మేటి దిట్ట. ప్రాథమిక స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగే వారికి, అర్ధంతరంగా పైకి వచ్చిన వారికి ఎంతో తేడా ఉంటుంది. అది ప్రభుత్వ అధికారులైనా, రాజకీయ నాయకులైనా అదే పరిస్థితి. క్రిందిస్థాయి నుంచి అంగీకరించిన బాధ్యతలను అమలు చేయడానికి అనేక ఆటుపోట్లుంటాయి. ఒక్క దఫా మంచి చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆటంకాలు ఎదురుకావడం అన్నిచోట్లా చూశాను.ఇలాంటి అనుభవాలు వైవీరెడ్డి జీవన గమనంలో మనం చూడవచ్చు. పదవులను ఆశించకుండా తమ విద్యుక్త ధర్మాన్ని పాటించుకుంటూ పోవటం, దాని ఫలి తంగా ఏమొస్తే దాన్ని మనఃస్ఫూర్తిగా స్వీకరించడం అత్యంత కష్టసాధ్యం. అయితే అలాంటి స్థితిలో పట్టుదల, నిర్మలత్వం, తొణికిసలాడకుండా, ఊగిసలాడకుండా దిటువుగా నిలబడటం ఎలా అనే ప్రశ్నకు వైవీరెడ్డి నిగ్రహ విగ్రహమే సమాధానం. ఉగాది ఉత్సవాలకోసం గవర్నర్‌ ఆహ్వానం మేరకు నేను హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌కు వెళ్లాను. అనుకోకుండా వైవీరెడ్డి పక్కన కూర్చునే అవకాశం కలిగి నందుకు సంతోషించాను.ప్రధాని మోదీ నల్లధనంపై దాడి చేసిన తర్వాత, ఈ అంశంపై సెమినార్‌ పెట్టడానికి వైవీరెడ్డిని ఆహ్వానించాను. వారు సున్నితంగా తిరస్కరించారు. ఉగాది సందర్భంగా కలిసినప్పుడు ఆ అంశాన్ని ప్రస్తా వించాను. దానికి వారి సమాధానం ‘నా బయోగ్రఫీ నీకు పంపుతాను, దాన్ని చదవండి’ అన్నారు. ‘మీరెందుకు పంపడం, నేనే తెప్పించుకుంటాను సార్‌’ అన్నాను. తర్వాత విశాలాంధ్ర బుక్‌హౌస్‌ ద్వారా తెప్పించుకున్నాను. ఆర్‌బీఐకి సంబంధించి నల్లధనంపై నేను సలహా అడిగితే, తన జీవిత చరిత్ర చదవమంటారేంటి అనుకొని అనాసక్తిగా చదవడం మొదలుపెట్టాను. జన్మ నేపథ్యం తర్వాత వారి చదువు, ఉద్యోగం, ఎస్‌ఆర్‌ శంకరన్‌తో పనిచేయడం చూశాక నాకు కొంత చదవడానికి ఆసక్తి పెరిగింది. క్రమంగా అంచెలంచెలుగా బాధ్యతలు పెరగడం, ప్రతి సందర్భంలో నిగ్రహ విగ్రహం గుర్తొస్తూనే ఉంది.రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గురించి ఇంతటి లోతుపాతులు నాకు తెలియదు. ఆర్థిక వ్యవస్థను నిర్దేశిస్తుందని మాత్రమే తెలుసు. అయితే అదే ఆర్బీఐ పాత్రపై నాకు అపనమ్మకం, అసంతృప్తి కూడా ఉంది. దానికి కారణం ఎగవేతదారులపై చర్యలు, రెండవది మైక్రో ఫైనాన్స్‌ (సూక్ష్మ రుణ వ్యవస్థ)పై నాకు తీవ్ర అసంతృప్తి ఉంది. అందులో మైక్రో ఫైనాన్స్‌ బాధితుల తరఫున నేను ప్రత్యక్ష యుద్ధం చేశాను. మైక్రో ఫైనాన్స్‌ మాఫియాపై దాడి చేయండని బహిరంగంగానే పిలుపిచ్చాను. జయప్రదం అయ్యిందానికి సంతృప్తిపడ్డాను. సరళీకరణ, అంతర్జాతీయ ఒప్పం దాలు, అంతర్జాతీయ స్థాయిలో వచ్చే ఒత్తిడి. అందులో భాగంగా మైక్రో ఫైనాన్స్‌ సంస్థల పట్ల ఆర్బీఐ వైఖరి, దాని వైఫల్యం గురించి వైవీరెడ్డి పొరపాటు అంచనా వేశామని కూడా అంగీకరించారు. అన్నింటికంటే ముఖ్యంగా భారత్‌ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వైవీరెడ్డి తీసుకున్న దృఢమైన వైఖరి అనూహ్యం. అందుకే వామనావతారమైనా ఆజానుబాహుడని సంబోధించేం దుకు సాహసించాను.బంగారానికి మన సమాజంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. అది సెంటిమెంట్‌ గాకుండా, జీవనాధారంగా, భారతీయులకు అదొక రక్షణ కవచం. ఆ మధ్య బంగారు నగలపై మోదీ ప్రభుత్వం కొంత కదిలించి, తిరోగమన పలాయనం చెందిన చేదు అనుభవం మనం మరవలేదు. అలాంటి సెంటిమెంట్‌ గేమ్‌లో కూడా వైవీరెడ్డి జయప్రదం అయ్యారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినప్పుడు తీవ్రమైన ఆలోచనతో ‘బంగారం తాకట్టు’ విధానాన్ని అమలు చేయడంలో వైవీరెడ్డి పాత్ర గొప్పది. అది ఒక విధంగా అగ్నిపరీక్షే. అదే వైఫల్యం చెంది ఉంటే వైవీరెడ్డి నిజంగా వామనుడిగానే ఉండేవారు.సహకార సంస్థలు, ప్రైవేటు బ్యాంకులపై కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నారు. కొంతమంది ఆర్థిక నిపుణులు కూడా ‘ముందస్తు ఎలా పసిగట్టావ్‌ వేణు’ అని ఆశ్చర్యపోయిన ఘటనలు చూస్తే అర్థమవుతుంది. అలాగే 2008లో అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైంది. ఆ సందర్భంలో కూడా భారతీయ పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకులు, రుణాలు తదితరాలపై తీవ్ర కృషితో హోంవర్క్‌ చేశారు. సాహసంగా నిలబడ్డారు. ఆ సందర్భంలో పైపై సంక్షోభం తప్ప, గ్రామీణ స్థాయిలో తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఏర్పడలేదు. ఇక్కడ ఒక్కమాట చెప్పాలి. అది వైవీరెడ్డి చెప్పలేరు. నా మాటలో చెప్పడం కన్నా, కమ్యూనిస్టు వ్యతిరేకి అయిన ఆనాటి ఆర్థిక మంత్రి చిదంబరం మాటల్లో చెప్పాలంటే.. ‘ఈ ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా మనం అతీతులుగా ఉన్నందుకు కమ్యూనిస్టులకు కృతజ్ఞతలు చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు.అంటే యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర వహించారు. ఆ సందర్భంగా మన్మోహన్‌ సింగ్, చిదంబరంలు ఆర్థిక వ్యవస్థలో కొంత మార్పుకు ప్రయత్నించగా, దాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిం చాయి. దాని ఫలితంగా చిదంబరం లాంటి వారు కూడా కమ్యూనిస్టులకు కృతజ్ఞతలు తెలియజేయడమనేది రాజ కీయ ప్రాముఖ్యత కలిగింది. అదే సందర్భంలో వ్యవస్థాగత నిర్ణయాలకు వైవీరెడ్డి కేంద్ర బిందువయ్యారు.ఈ జీవిత గ్రంథంలో ఆర్‌బీఐ ఆర్థిక విధానాలు, రాజకీయ ప్రముఖుల ప్రస్తావన, ఆర్థిక నిపుణులలో సైతం భిన్నాభిప్రాయాలు, వాటిని ఏ విధంగా అధిగమించాలో చాలా గొప్పగా వివరించారు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ అధిగమించాలో? ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ తప్పును నమ్రతతో అధిగమించాలో తెలుసుకుని, విజయం పొంది నప్పుడు కాలరెగరేసి మాట్లాడకుండా ఒదిగి మన్ననలను పొందేవారు వైవీరెడ్డి. అంతా చదివాక మిలియన్‌ డాలర్ల ప్రశ్న నాలో మిగిలింది. మోదీ నల్లధనంపై దాడి ఘటన సందర్భంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా వైవీరెడ్డి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో? అంగీకరించేవారా? వ్యతిరేకించేవారా?


వ్యాసకర్త సీపీఐ జాతీయ కార్యదర్శి - 94909 52222

డాక్టర్‌ కె. నారాయణ


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top