‘ఇంగ్లండ్ డాటర్’

‘ఇంగ్లండ్ డాటర్’ - Sakshi


ఇంకా ఈ దేశం బానిసత్వంలోనే మగ్గుతోందని భావించే- మనల్ని బానిసత్వంలో మగ్గించిన దేశపు మహిళ కొన్ని తప్పుడు మాటల్ని చిత్రంగా రూపొందించగా ఈ దేశంలో మేధావులు దాన్ని నెత్తిన వేసుకుని ఉద్రేకపడుతున్నారు.

 

డిసెంబర్ 16, 2012. నిర్భ య రేప్. ఆరుగురు రేప్ చేసి ఆమె మర్మావయవాలను గాయం చేసి దారుణంగా చంపారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం వారికి ఉరిశిక్ష విధించిం ది. ఒక నేరస్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

 

మూడేళ్ల తర్వాత ఒక ఇం గ్లండ్ డాటర్ లెస్లీ ఉడ్విన్ అనే చిత్ర నిర్మాత- ప్రపం చంలో మహిళలకు జరిగే అన్యాయా న్ని గురించి ‘ఇండియాస్ డాటర్’ అనే డాక్యు మెంటరీని తీయడానికి పూనుకుంది. ఆ మధ్య ఇంగ్లండ్‌లో చాలా రేప్‌లు జరిగాయి. కాని ఈ ఇంగ్లండ్ డాటర్‌కి నమూనాగా ఇండియా డాటర్ రేపే కావలసి వచ్చింది.

 

ఇండియా వచ్చి-ఈ దేశపు చట్టాలు సవ్యంగా పని చేస్తే-ఈపాటికి ఉరికంబం ఎక్కవలసిన ముఖేష్‌సింగ్ అనే మానవ మృ గాన్ని కలిసింది. ఈయన ఇంటర్వ్యూకి రెండు లక్షలు అడిగాడు. 40 వేలకి ఒప్పందం కుదిరింది. ఈ పశువు చెప్పిన విషయాలు, అతని మాటల్లోనే: ‘‘కుర్రాడి కంటే రేప్‌కి అమ్మాయికే బాధ్యత ఎక్కువ. రాత్రి 9 గం టలకి మర్యాదైన ఆడపిల్ల రోడ్డు మీద తిరగదు. ఇంటి పని, వంటపని ఆడవాళ్ల పనులు. డిస్కో లకి తిరగడం, తప్పుడు బట్టలు వేసుకోవడం కాదు. నేను రేప్ చేస్తున్నపుడు ఆమె ఎదిరించకుండా ఉండాల్సింది. నిశ్శబ్దంగా రేప్ జరగనివ్వాలి. అప్పుడు వ్యవహారం ముగిశాక ఆమెని వదిలేసేవాళ్లం-కుర్రాడిని నాలుగు తన్ని.’’

 

ఈ కేసు వాదిస్తున్న ప్రబుద్ధుడు డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ గారి అభిప్రాయాలు, వారి మాటల్లోనే, ‘‘ నా కూతురో, చెల్లెలో పెళ్లికాకుండా ప్రేమలో పడి అవమా నకరంగా ప్రవర్తిస్తే - ఆవిడని నా ఫార్మ్‌హౌస్‌కి తీసుకెళ్లి నా బంధువులందరి ముందూ పెట్రోలు పోసి తగ లెడతాను.’’

 

నాకు ఈ డాక్యుమెంటరీని చూసే అవకాశం, అదృ ష్టం కలగలేదు. కాని దీన్ని చూసి తీరాలని చాలామంది మేధావులు ఈ దేశంలో గొంతు చించుకుంటున్నారు. సమాజంలోని తప్పుడు ఆలోచనా ధోరణిని (mindset) ఎండగట్టడానికి ఇలాంటి డాక్యుమెంటరీ రావలసిందే నని ప్రముఖ కవి, రచయిత జావెద్ అఖ్తర్ పార్లమెం టులో గొంతు చించుకున్నారు. ఆయన రచనల మీదా, కవితల మీదా నాకు అపారమైన గౌరవం. ఇక్కడ ఆగు తాను. కాని ముఖేష్‌సింగ్ మాట ఈ దేశపు ఆలోచనా ధోరణికి ప్రాతినిధ్యం వహించదు. ఒక దౌర్భాగ్యుడి moral perversion, decadenceకీ మాత్రమే నిదర్శనం.

 

ఈ ఇంగ్లండ్ డాటర్ చేసిన నేరాలు. 1. మరణశిక్ష పడిన ఖైదీని ఇంటర్వ్యూ చెయ్యడానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదు. 2. నిర్భయ పేరుని ప్రకటించింది. 3. ఆమె ఫొటోను ప్రకటించింది(ట). 4. పూర్తయిన డాక్యుమెంటరీని అధికారులకు చూపి వారి సమ్మతిని తీసుకోలేదు. 5. బీబీసీ దీనిని మహిళా దినోత్సవానికి ప్రసారం చేయాలని తలపెట్టి, దేశంలో అలజడి లేవగానే లోపాయికారీగా ముందుగానే ప్రసారం చేసేసింది. ఈ డాక్యుమెంటరీని ఫలానా ఉడ్విన్ డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే, కెనడాలలో ప్రసారం చేయ సంక ల్పించిందట. ఇండియాలో 24X7 చానల్ మార్చి 8న ప్రసారానికి అంగీకరించింది. ఆరు దేశాలలో ‘ఇండియాస్ డాటర్’ ప్రసారం భారతదేశానికి ఏ విధంగా ఉపయోగం? ఉడ్విన్‌కి డబ్బు కలసివస్తుంది. మనకి గబ్బు కలసివస్తుంది. బ్రిటిష్ వారికి మన పట్ల ప్రేమని అలనాడు చర్చిల్ నాటి నుంచీ వింటున్నాం.

 

మన దేశంలో- నాకు తెలుగు బాగా రాదు క్షమిం చాలి-ఇంటెలెక్చువల్ హిపోక్రసీ ఎక్కువ. హృదయ వైశాల్యం గల భారతీయ మేధావులు-ఇండియా రేప్ కథని - ఇందుమూలంగా అంతర్జాతీయంగా లేచిన దుమారాన్నీ సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడ్డ ఓ ఇం గ్లండ్ డాటర్ కళాఖండాన్ని-చట్టాలనీ మాన వీయ విలువలనీ ఆంక్షలనీ విస్మరించి- ఆరు దేశాలలో ప్రసా రం చేయడం ద్వారా ఈ దేశ ప్రజల ఆలోచనా ధోరణి మార్పుకు సహకరిస్తుందని భావిస్తున్నారు.

 

ఓ నీచుడి తప్పుడు మాటల్ని ఇంకా ఈ దేశం బానిసత్వంలోనే మగ్గుతోందని భావిం చే- మనల్ని బానిసత్వంలో మగ్గించిన దేశపు మహిళ చిత్రంగా రూపొందించగా ఈ దేశం లో మేధావులు దాన్ని నెత్తిన వేసుకుని పత్రి కల్లో పార్లమెంటుల్లో ఉద్రేకపడుతున్నారు.

 

ఆత్మాభిమానం ఉన్న ఏ భారతీయుడైనా-పశు ప్ర వృత్తికి ఓ ఆడపిల్ల జీవితాన్ని బలిచేసి, డబ్బు కోసం దిక్కుమాలిన, దుర్మార్గపు అభిప్రాయాలను చెప్పగా, దా న్ని సొమ్ము చేసుకుని-సమాజ హితమని దొంగ పేరు పెట్టిన ఘనమైన నిర్మాతకి సవినయంగా, స్పష్టంగా, నిర్ద్వంద్వంగా ఒకే ఒక్కమాట చెప్పాలని నరాలు పొంగు తున్నాయి: ‘‘షటప్!’’


(ఈ కాలమ్ రాశాక అమెరికా మిత్రుడు డాక్యు మెంటరీని పంపారు. దాన్ని చూశాక కూడా ఒక్క అక్షరం మార్చాలని అనిపించలేదు.)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top