ముసురు సంధ్యవేళ
ముసురు సంధ్యవేళ
నిదురకొసన నిప్పు రగులుతూనే ఉంది
మునుపటి స్వప్నం కోసం
ఆన్‌లైన్ బుకింగ్ అర్జీ
కిందటి పిలుపుకోసం
డయల్ - రీడయల్
సారీ...:
మీరు కాల్ చేస్తున్న సబ్‌స్క్రైబర్
ప్రస్తుతం స్పందించుట లేదు
లేదా, స్పందించుటకు ఇష్టపడుట లేదు
ఎట్లీస్ట్-
కవిత్వం కూడా కమ్యూనికేట్ కావడం లేదు
గుండెను నెత్తట్లో ముంచి
ఫెన్సింగ్‌పై ఆరేసినట్టుంది
వాక్యం శిథిలమై
అక్షరాలు అక్షరాలుగా కూలిపోయింది
కాన్షియస్ గానో
సబ్ కాన్షియస్ గానో
ఒక పిచ్చిమొక్క
లోకం చూసీ చూడకముందే
సామాజిక పదఘట్టనల కింద
నలిగిపోయింది
ఇక తవ్వినకాడికి చాలుగానీ
అటు విను...
సిలోన్‌లో ఓపీ నాయర్ సిగ్నేచర్
ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా
ముసురు పట్టింది
విస్కీ దట్టించు జహాపనా!
‘హిమజ్వాల’
ఫోన్: 9553955320
ప్రసంగం
జూన్ 13న సాయంత్రం
5 గంటలకు ‘బౌద్ధ శిల్పంలో ఆధునికత’ అంశంపై టి.శివాజి ప్రసంగిస్తారు. వేదిక: ప్రెస్ క్లబ్, సోమాజిగూడ, హైదరాబాద్; నిర్వహణ: ‘ఛాయ’
ఆవిష్కరణ
‘కవి సంధ్య’ ఆధ్వర్యంలో శిఖామణి మూడు పుస్తకాలు- పొద్దున్నే కవి గొంతు(కవిత్వం), తెలుగు మరాఠి దళిత కవిత్వం(పరిశోధన), స్మరణిక(సాహిత్య నివాళి)- జూన్ 13న సాయంత్రం 6 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఆవిష్కరణ కానున్నాయి. గుమ్మడి గోపాలకృష్ణ పద్య పఠనంతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సినారె, మండలి బుద్ధప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి, మల్లాడి కృష్ణారావు, ఇనాక్, శివారెడ్డి, ఓల్గా, ఖాదర్ మొహియుద్దీన్, సీతారాం, విజయభాస్కర్, ప్రసాదమూర్తి, దాట్ల దేవదానం పాల్గొంటారు.