సింగపూర్‌లో నేత్రపర్వంగా శ్రీ సీతారాముల కళ్యాణం

Sri Sitha Ramula Kalyanam in Singapore - Sakshi

సింగపూర్ : సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయ సమీపంలోని పి.జి.పి. హాల్‌లో భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం అట్టహాసంగా, భక్తుల రామనామ సంకీర్తనల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా భద్రాచలం నుండి శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమ సమేతంగా భద్రాచల అర్చక బృందం సింగపూర్ వచ్చి శ్రీ సీతారామల కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, కళ్యాణ భోజన వితరణ చేశారు. రామరక్షాస్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణ, భక్తుల అర్చన ఇతర సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి, ప్రసాద వితరణ చేశారు. 

ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ స్వామి భద్రాచలం నుండి సింగపూర్ రావడం, భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏవిధంగా నిర్వహిస్తారో అదేవిధంగా జరుపుకోవడం మనందరి అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహాయసహకారాలందించిన భద్రాచల దేవస్థానం సమన్వయకర్త పద్మజారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు రెండువేల మంది పైగా హాజరయ్యారని అందరికీ కల్యాణ తలంబ్రాలు అందించామని కార్యదర్శి సత్య చిర్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు సహాయసహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులకు, స్థానిక దేవాలయాల కమిటీలకు, కళ్యాణంలో పాల్గొన్నవారికి, దాతలకు, స్వయంసేవకులకు కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top