ఇరాక్‌లో ఇందన్‌పల్లి వాసి మృతి

Indian Man Died In Iraq Road Accident - Sakshi

సాక్షి, జన్నారం: ఉపాధి వేటలో మరో కూలీ రాలిపోయాడు. ఉన్న ఊరిలో పని దొరక్క గల్ఫ్‌ వెళ్లిన కార్మికుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబలించింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లికి చెందిన రాగుల రాజేందర్‌(32) నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం ఇరాక్‌ దేశం వెళ్లాడు. వెళ్లే సమయంలో ఏజెంట్‌కు రూ.2లక్షలు అప్పజెప్పాడు. అక్కడికి వెళ్లాక పని దొరకలేదు. దీంతో 20 రోజుల క్రితం ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఓ కంపెనీలో కూలీగా చేరాడు. పనిచేస్తూ వేరే చోట గదిలో ఉండేవాడు. ఈక్రమంలో శనివారం పని ముగించుకుని గదికి తిరిగి వెళ్తుండగా ఎర్బిల్‌లోని అక్వాం ప్రాంతంలో రోడ్డు దాటే క్రమంలో కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో రాజేందర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని రాజేందర్‌తో పనిచేస్తున్న స్నేహితులు ఇందన్‌పల్లిలోని కుటుంబీకులకు ఫోన్‌ ద్వారా చేరవేశారు. 

కుప్పకూలిన తల్లి..
కుమారుడి మరణ వార్త విని తల్లి ఎల్లవ్వ కుప్పకూలింది. గల్ఫ్‌ వెళ్లి కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కొడుకు విగత జీవుడిగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతుడికి భార్య శైలజతో పాటు ఆరునెలల కుమారుడు మణికుమార్‌ ఉన్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ గల్ఫ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి మాటేటి కొమురయ్య ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే హైదరబాద్‌లోని గల్ఫ్‌ సెక్షన్‌ సెక్రెటరీ రాజుతోనూ మాట్లాడారు.

ప్రవాస మిత్ర లేబర్‌ యూనియన్‌ పరామర్శ..
ఇరాక్‌లో మృతిచెందిన రాజేందర్‌ కుటుంబాన్ని ఆదివారం ప్రవాస మిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరికిపండ్ల స్వదేశ్‌ పరామర్శించారు. ఇందన్‌పల్లిలో కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇరాక్‌లోని ఇండియన్‌ ఎంబసీ అధికారులతో మాట్లాడి రాజేందర్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పిస్తామని తెలిపారు. అలాగే రాజేందర్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. గల్ఫ్‌లో ఏదైనా సమస్య వస్తే వలస కార్మికులు ప్రభుత్వ హెల్ఫ్‌లైన్‌ నంబర్‌ 1800119030 లేదా మిత్ర లేబర్‌ యూనియన్‌ నంబర్‌ 9491613129లో సంప్రదించాలని కోరారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top