అక్కినేని అంతర్జాతీయ అవార్డులు ప్రకటన

Akkineni International Award Winners Announced In Dallas - Sakshi

డాలస్, టెక్సాస్: పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్‌ఏ) బోర్డు సమావేశం డాలస్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏఎఫ్‌ఏ అధ్యక్షురాలు శారద ఆకునూరి మాట్లాడుతూ.. అనేక దశాబ్దాలుగా అక్కినేని నాగేశ్వరరావు గారితో సన్నిహితంగా మెలిగి ఆయనను 1997లోను, 2012లోను టెక్సాస్‌కు తీసుకురావడంలో ముఖ్య కారకులైన డా.తోటకూర ప్రసాద్ నాయకత్వంలో 2014లో ఈ ఏఎఫ్‌ఏ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటికి వరకు ఐదు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని అన్నారు. 2019 సంవత్సరానికి గానూ డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నంలో వీఎమ్‌ఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఆరవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నామని శారద ఆకునూరి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆమె కోరారు. 

ఈ సమావేశంలో బోర్డ్‌ అఫ్ డైరెక్టర్స్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం, రావు కల్వల, డా. సి.ఆర్‌ రావులు అక్కినేని గారితో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషని కొనియాడారు. అక్కినేని అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అమెరికాలోని మిత్రులం కొంతమంది  ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా.అక్కినేని ఒక చిన్న కుగ్రామంలో, అతిసాధారణ కుటుంబంలో జన్మించి కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్థైర్యం, దూరదృష్టితో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ అంశాలనే ముఖ్యంగా యువతలో ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని ప్రసాద్‌ తోటకూర పేర్కొన్నారు. 2014లో గుడివాడ, 2015లో హైదరాబాద్, 2016లో చెన్నై, 2017లో ఏలూరు, 2018లో కరీంనగర్‌లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరిగాయని తెలిపారు. 

2019 అక్కినేని అంతర్జాతీయ పురస్కార గ్రహీతలు 

“జీవిత సాఫల్య పురస్కారం”– శ్రీమాగంటి మురళీమోహన్, సినీ, వ్యాపార, రాజకీయ రంగాలలో ప్రముఖులు 

"విద్యా రత్న” – ప్రొఫెసర్. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఛైర్మన్  

"సినీ రత్న"– “మహానటి” చిత్రబృందం, జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్న చిత్రం  

"వ్యాపార రత్న"-  డా. సూరపనేని విజయకుమార్, నిర్మాణ రంగంలో అగ్రగ్రామి, కళాపోషకులు 

"రంగస్థలరత్న"– పద్మశ్రీ డాక్టర్. శోభానాయుడు, కూచిపూడి నృత్యంలో అగ్రశ్రేణి నర్తకి, నాట్యాచారులు

"వైద్య రత్న"- డాక్టర్. ముళ్ళపూడి వెంకటరత్నం, సామాన్య ప్రజల పాలిట పెన్నిధి  

"సేవా రత్న" – “మన కోసం మనం ట్రస్ట్”– చల్లపల్లి, పరిశుభ్రత, పచ్చదనంలో సమిష్టి కృషి

"వినూత్న రత్న"– శ్రీసత్తిరాజు శంకరనారాయణ, పెరేన్నికగన్న పెన్సిల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్  

"యువ రత్న” – శ్రీ ఫణికెర క్రాంతికుమార్, సాహసవీరుడు 

కాగా, అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సంస్థకు డాక్టర్.ప్రసాద్ తోటకూర(వ్యవస్థాపక అధ్యక్షులు), శారద ఆకునూరి(అధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట(ఉపాధ్యక్షులు), డాక్టర్.సి.ఆర్.రావు( కార్యదర్శి), రవి కొండబోలు(కోశాధికారి), రావు కల్వల, ధామా భక్తవత్సలు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.akkinenifoundationofamerica.org ను సందర్శించండి. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top