'గుండమ్మ కథ'కు 62ఏళ్లు.. వీడియో విడుదల, ఈ విషయాలు తెలుసా? | Gundamma Katha Movie Celebrations 62 Years | Sakshi
Sakshi News home page

'గుండమ్మ కథ'కు 62ఏళ్లు.. వీడియో విడుదల, ఈ విషయాలు తెలుసా?

Jun 7 2025 3:00 PM | Updated on Jun 7 2025 4:27 PM

Gundamma Katha Movie Celebrations 62 Years

అమెజాన్‌ ప్రైమ్‌లో 'గుండమ్మ కథ' స్ట్రీమింగ్‌

సినిమా విడుదలై 62 ఏళ్లు పూర్తి.. ఈ సందర్భంగా వీడియో విడుదల
 

చిత్ర పరిశ్రమ ఏదైనా సరే.. అందులో కొన్ని క్లాసిక్స్‌ సినిమాలు ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా, తియ్యటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. 1962 జూన్‌  7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు..? అన్న దగ్గర మొదలై... ఈ సినిమా చూడని వారు ఉన్నారా..? అనేవరకూ వెళ్లింది. అలాంటి కల్ట్‌ క్లాసిక్‌  సినిమా విడుదలైంది ఇదే రోజు.. తాజాగా ఈ మూవీ 62 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు విశేషాలను గుర్తు చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఓ స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది.

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ వంటి ఇద్దరు స్టార్‌ హీరోలు... సావిత్రి, జమున వంటి హేమాహేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్‌ రోల్లో ‘గుండమ్మ కథ’ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్‌’ వంటి క్లాసిక్స్‌ తీసిన విజయా సంస్థ తొలిసారిగా రీమేక్‌ చేసిన సినిమా ‘గుండమ్మ కథ’. కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమాకు రీమేక్‌ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్‌ స్టార్లున్నా ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పేరుపై టైటిల్‌ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్టును విజయా వారు చేయడానికి కారణం.. సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా.. విఠలాచార్య ఆయన్నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్‌ రైట్స్‌ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య.

వారిద్దరికీ నూరవ చిత్రమే
హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఇది 100వ చిత్రం. అప్పటికి ఎన్టీఆర్‌ తెలుగులో రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్‌ ఈ సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్‌తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్‌కున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, ఏఎన్నార్‌లతో రీమేక్‌ చేశారు.

గుండమ్మ పాత్ర ఎంపిక కోసం..‌
సినిమా కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి వారంతా డేట్స్‌ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్‌లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి ‘గుండమ్మ’ పాత్రకు ఆమైతేనే కరెక్ట్‌ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌తో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట.

కథేంటంటే...
ఈ చిత్రకథ విషయానికొస్తే.. గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు లక్ష్మి (సావిత్రి)ని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ (జమున)ను మాత్రం గారాభంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్‌ ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్‌ (అంజి), ఏఎన్నార్‌ (రాజా) ఆ ఇంట్లో చెరో దారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు? గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది? అనేదే ‘గుండమ్మ కథ’ స్టోరీ.

Advertisement
 
Advertisement
Advertisement