ఆన్‌లైన్‌లో సబ్సిడీ విత్తనాలు

Subsidy seeds in online - Sakshi

బాన్సువాడ: సబ్సిడీ విత్తనాలను అక్రమార్కులు సరిహద్దులు దాటించి పక్క రాష్ట్రాలకు విక్రయించే విధానానికి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. సబ్సిడీ విత్తనాలు అసలైన రైతులకే లభించేలా ఆన్‌లైన్‌ విధానాన్ని సర్కారు ప్రవేశపెట్టింది. గతేడాది వానాకాలం సీజన్‌లోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా, సత్ఫలితాలొచ్చాయి. దీంతో ప్రస్తుత ఖరీఫ్‌లోనూ ఆన్‌లైన్‌లోనే విత్తనాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న తర్వాతే రైతులకు సబ్సిడీ విత్తనాలను అందిస్తారు. రాయితీ విత్తనాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అక్రమాలకు తెర పడనుంది. 

రాయితీ విత్తనాల్లో అక్రమాలు 
ప్రతి ఏడాది రాయితీ విత్తనాల పంపిణీలో అక్ర మాలు జరిగేవి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలకు చెందిన కొందరు వ్యక్తులు సబ్సిడీ విత్తనాలను మహారాష్ట్ర, కర్ణాటకకు తరలించి, అక్కడ విక్రయించే వారు. శనగ విత్తనాలు క్వింటాళ్ల కొద్దీ తరలిపోయేవి. ఏ రైతు ఎన్ని విత్తనాలు తీసుకొంటున్నారనే సమాచారం ఉండేది కాదు. గతంలో కొన్ని విత్తనాలు కేంద్రాల కు రాకముందే నేరుగా తరలించి విక్రయించుకున్నారు. అందుబాటులో విత్తనాలు ఎన్ని ఉన్నా యో తెలియని పరిస్థితి ఉండేది. ఎన్ని రోజులు ఇస్తారో తెలిసేది కాదు.

 దీంతో రైతులు విత్తన కొనుగోలు కేంద్రాల్లో బారులు తీరి, విత్తనాలు ల భించక ఆందోళనలు చేసే వారు. కొందరు రైతుల పేరును ఉపయోగించుకొని సబ్సిడీ విత్తనాలు తీసుకొని మార్కెట్లో అమ్ముకొనేవారు. అధికారు లు ఇష్టం వచ్చిన వారికి కూపన్లు జారీ చేసే వారు. మార్కెట్‌లో సంబంధిత విత్తనాల ధరలు ఎక్కువ ఉండడం, రాయితీ విత్తనాలు తక్కువ ధరకు లభించడంతో వేల క్వింటాళ్ల విత్తనాలు పక్కదారి పట్టేవి. గతంలో విత్తనాలు పొందాలంటే మండల కేంద్రానికి వెళ్లి కూపన్లు పొందాల్సి వచ్చేది. కొన్ని గ్రామాల రైతులకు దూర భారం కావడంతో పాటు వెళ్లిన సమయంలో వ్యవసాయాధికారి లేని పక్షంలో కూపన్లు తీసుకోవడానికి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. 

అక్రమాలకు చెక్‌ 
ఈ నేపథ్యంలో సబ్సిడీ విత్తనాల సరఫరాలో జరుగుతున్న అక్రమాలకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. గతేడాది జీలుగ, జనుము విత్తనాలను ఆన్‌లైన్‌లో సరఫరా చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ప్రస్తుత వానాకాలంలో వీటితో పాటు వరి, సోయా విత్తనాలను కూడా ఆన్‌లైన్‌లోనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్‌ సీజన్‌లో రాయితీ విత్తనాలు పొందేందుకు వీలుగా క్లస్టర్‌ స్థాయిలో కూపన్లు పొందేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో పంటలు సాగు చేస్తారని అంచనా. ఈ మేరకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఇతర పంటల సాగు విస్తీర్ణం మేరకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి కాగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సీజన్‌ నుంచి మండల వ్యవసాయాధికారి ద్వారా క్లస్టర్‌ స్థాయిలోనే కూపన్లు జారీ చేయనున్నారు.  

ఆన్‌లైన్‌ ఇలా.. 
రాయితీ విత్తనాలు అవసరమైన రైతులు వ్యవసాయాధికారి వద్దకు వెళ్లి తమ పట్టాదారు పాస్‌పుస్తకం ఖాతా సంఖ్య నమోదు చేయించాలి. ఆ రైతుకు సంబంధించిన భూమి వివరాలు, సర్వే నంబర్, గతేడాది వేసిన పంట తదితర వివరాలు వెల్లడవుతాయి. రైతుకు ఉన్న భూమికి తగ్గట్టుగా అవసరమైన విత్తన సంచులకు సంబంధించిన కూపన్‌ నంబర్‌ రైతు సెల్‌ నంబర్‌కు చేరుతుంది. ఆ సంఖ్యను విత్తన కేంద్రంలో చూపించి రాయితీ పోనూ మిగతా డబ్బులు చెల్లిస్తే విత్తనాలు ఇస్తారు. అయితే, ఏ రోజు కూపన్‌ తీసుకొంటారో అదే రోజు రైతులు విత్తనాలను తీసుకోవాలి. మరుసటి రోజు ఆ కూపన్‌ చెల్లదు. మళ్లీ విత్తనాలు పొందాలంటే కూపన్లు పొందాల్సి ఉంటుంది. ఏ రోజు ఎంత మంది విత్తనాలు పొందారు? ఇంకా ఎంత నిల్వ ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వ్యవసాయ అధికారికి సమాచారం అందుతుంది. విత్తన కేంద్రాల్లో ఎన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయనే సమాచారం అధికారుల వద్ద ఉంటుంది. రైతులు రెండు, మూడు సార్లు విత్తనాలు కొనుగోలు చేయడానికి వీలుండదు.

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top